Chandrababu_Naidu_VivekanadaReddy_CBIవైఎస్ వివేక హత్య కేసు విచారణని వేగవంతం చేసిన సీబీఐ అధికారులు, శుక్రవారం ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్‌ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డిని, సిఎం అర్దాంగి వైఎస్ భారతి ఇంట్లో పనిచేసే నవీన్‌లని కడప సెంట్రల్ జైలులో ప్రశ్నిస్తున్నారు.

జనవరి 28న సీబీఐ అధికారులు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని తమ హైదరాబాద్‌ కార్యాలయంలో ప్రశ్నించారు. ఆ సందర్భంగా వారు వివేకా హత్య జరిగిన రోజున అవినాష్ రెడ్డి మొబైల్ ఫోన్‌ నుంచి నవీన్‌కి ఎక్కువ కాల్స్ వెళ్లిన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. కనుక ఆరోజు అన్నిసార్లు నవీన్‌కి ఎందుకు ఫోన్‌ చేశారనే విషయంపై అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన్నట్లు సమాచారం.

ఆరోజు ఆయన చెప్పిన విషయాల ఆధారంగా ఈరోజు కృష్ణమోహన్ రెడ్డిని, నవీన్‌లని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, రిమాండ్ ఖైదీలుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి, ఉమాశంకర్ రెడ్డికి, అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరికి సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 10వ తేదీన వారందరినీ ప్రశ్నించనున్నారు.

సీబీఐ అధికారులు మొదట ఎంపీ అవినాష్ రెడ్డిని, ఇప్పుడు సిఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని, సిఎం అర్దాంగి ఇంట్లో పనిచేసే నవీన్‌లని ప్రశ్నిస్తుండటంపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో స్పందించారు.

“ఇంతకాలం ఈ కేసు విచారణని ముందుకు సాగనీయకుండా సిఎం జగన్మోహన్ రెడ్డి అడ్డుకోగలిగారు. కానీ ఇప్పుడు సీబీఐ అధికారులు ఈ కేసు విచారణని వేగవంతం చేసి ముఖ్యమంత్రి ఇల్లు, కార్యాలయం వరకు వచ్చేశారు. కనుక ఏదో ఓ రోజున ఈ కేసులో సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రమేయం బయటపడక తప్పదు. అప్పుడు ఈ కేసులో జైలుకి వెళ్ళక తప్పదు,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.