Chandrababu Naidu-YS Jaganఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల వేడి మొదలయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 59.85% రిజర్వేషన్లు హైకోర్టు కొట్టేయడంతో అధికార పార్టీ నింద టీడీపీపై మోపి 50% రిజర్వేషన్ల పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధం అవుతుంది. అయితే ఈ తరుణంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్లాన్ ఒకటి చంద్రబాబు తెర మీదకు తెచ్చారు.

తగ్గించిన బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో టీడీపీ నాయకులు పిటీషన్ వేశారు. ప్రభుత్వం సుప్రీం కు వెళ్ళకపోవడంతో ఈ విషయంలో తామే ఎక్కువ చిత్తశుద్ధితో ఉన్నాం అని వారు నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఈ నెలాఖరుకు ఎన్నికలు నిర్వహించకపోతే 14వ ఆర్ధిక సంఘం ఇచ్చే నిధులు మురిగిపోతాయి.

ఇప్పటికే అనేక ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నిధులు చాలా అవసరం. పలు సంక్షేమ పథకాల పంపిణీకి వీటి మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. సుప్రీంకు వెళ్తే నెలాఖరు లోగా ఈ కేసు తేలే అవకాశం ఉండదు. దానితో అందుకు జగన్ ప్రభుత్వం సుగమంగా లేదు.

టీడీపీ కోర్టుకు వెళ్లి ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోకపోతే అది వైఎస్సార్ కాంగ్రెస్ కు రాజకీయంగా ఇబ్బందే. దీనితో రెండు రకాలుగా అధికార పార్టీ ఇరుకున పడినట్టే కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా ఏకకాలంలో… అంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈనెల 21న, పురపాలక సంఘాలకు ఈనెల 24న గ్రామ పంచాయతీలకు 27న వేర్వేరు తేదీల్లో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.