Chandrababu-Naidu-Words-Came-To-Reality-On-KCR-and-YS-Jagan2019 ఎన్నికలలో ‘ఒకే ఒక్క ఛాన్స్’ అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందుకు రాగా, జగన్‌కు ‘ఒక్క ఛాన్స్’ ఇస్తే అమరావతి, పోలవరం నిర్మాణాలు నిలిచిపోతాయని, ఆ రెండూ పూర్తిచేసుకోవాలంటే మళ్ళీ టిడిపికే ఓటు వేయాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు హితవు చెప్పారు. కానీ ప్రజలు ‘ఒక్క ఛాన్స్’ ఇచ్చేశారు.

ఏపీ కంటే కాస్త ముందుగా 2018 డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగాయి. అక్కడి ప్రజలు చాలా విజ్ఞతతో ఆలోచించి వరుసగా రెండోసారి కూడా టిఆర్ఎస్‌ ఎన్నుకోవడంతో ఆ రాష్ట్రంలో 2014లో మొదలైన అభివృద్ధిపనులు చకచకా పూర్తవుతున్నాయి. ఆ కారణంగా దేశంలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదగలిగింది.

రాష్ట్రంలో బలమైన ప్రజాప్రభుత్వం… స్థిరమైన విధానాలతో కొనసాగుతుండటంతో తెలంగాణ రాష్ట్రానికి ఈ 8 ఏళ్లలో లక్షల కోట్ల పెట్టుబడులు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, ఐ‌టి కంపెనీలు తరలివచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ప్రజలు ఇచ్చిన ఈ రెండో అవకాశాన్ని కూడా టిఆర్ఎస్‌ సద్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తూ ఇప్పుడు జాతీయస్థాయిలో చక్రం తిప్పేందుకు సిద్దం అవడం అందరూ చూస్తూనే ఉన్నారు.

కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మొదటిసారి చాలా విజ్ఞతతో ఓట్లు వేసి టిడిపికి అధికారం కట్టబెట్టినప్పటికీ, రెండోసారి దానిని కాదని వైసీపీకి అధికారం కట్టబెట్టడంతో పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చేసింది.

ఆనాడు శ్రీకాకుళంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “తెలంగాణ సిఎం కేసీఆర్‌ జగన్‌ని అడ్డుపెట్టుకొని అమరావతిని అడ్డుకోవాలని చూస్తున్నారని” హెచ్చరించారు. జగన్ అధికారంలోకి వస్తే అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు నిలిచిపోతాయని హెచ్చరించారు. ఆరోజు ఆయన చెప్పినట్లుగానే అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు నిలిచిపోయాయి.

జగన్ ప్రభుత్వం అమరావతికి బదులు మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చి మూడున్నరేళ్ళవుతున్నా దానినీ ఇంతవరకు అమలుచేయలేకపోతోంది. పోలవరం కట్టలేక గత ప్రభుత్వాన్ని నిందిస్తూ కాలక్షేపం చేసేస్తోంది.

తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి చంద్ర ఎస్‌ దేవినేని, ఇదే విషయం గుర్తు చేస్తూ “ఆ ఒక్కరోజు పెద్దాయన మాటలు విని ఉంటే నేడు రాష్ట్రానికి ఇన్ని కష్టాలు, రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు జరిగేవి కావు,” అని ట్వీట్ చేస్తూ, 2019, మార్చి 31వ తేదీన శ్రీకాకుళంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి సంబందించి పేపర్ కటింగ్ ఒకటి జత చేశారు. అది చూసినప్పుడు ‘నిజమే కదా…’ అని రాష్ట్రంలో ఎవరైనా అనుకోకుండా ఉండగలరా?