chandrababu-naidu-Jagan2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి ప్రభంజనం రాగా 2019 ఎన్నికలలో వైసీపీ ప్రభంజనం ఏర్పడింది. కానీ 2024లో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ ప్రభంజనం ఉండకపోవచ్చు. ఇందుకు బలమైన కారణాలే కనిపిస్తున్నాయి.

సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుకొంటున్నట్లు వచ్చే ఎన్నికలలో 175 సీట్లు వైసీపీయే గెలుచుకోవడం అసంభవం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరి పరిపాలన తీరును చూశారు కనుక ఈసారి వారిరువురి పాలనను బేరీజు వేసుకొనే అవకాశం ప్రజలకు లభించింది.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్ధిక సమస్యలలో చిక్కుకొన్నా చంద్రబాబు నాయుడు ఏమాత్రం అధైర్యపడకుండా అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాలు చేస్తూ రాష్ట్రాభివృద్ధికి చాలా తీవ్రంగా కృషి చేశారు. మరోపక్క సంక్షేమ పధకాలను కొనసాగించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, ఉన్నత విద్యాసంస్థలు, వైద్య సంస్థలు, యూనివర్సిటీలను రప్పించేందుకు చాలా కృషి చేశారు. కొంతమేర సఫలం అయ్యారు కూడా. చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రాభివృద్ధిని ప్రజలు చూశారు.

జగన్ పాలనలో అభివృద్ధిని, రాష్ట్ర భవిష్యత్‌ని పణంగా పెట్టి సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నారు. వీటితో రాష్ట్రం దివాళా తీస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమందికి అనేక సంక్షేమ పధకాలు అందుతున్నాయనేది వాస్తవం. కనుక వాటిని పొందుతున్న లబ్దిదారులందరూ వైసీపీకే తప్పక ఓట్లు వేస్తారని, అందుకే ఈసారి 175 సీట్లు తమ పార్టీకే వస్తాయని సిఎం జగన్మోహన్ రెడ్డి నమ్మకంగా చెపుతున్నారు.

కనుక అభివృద్ధి, సంక్షేమ పధకాలతో ప్రజలు టిడిపి, వైసీపీల మద్య చీలిపోయినట్లు కనిపిస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అభివృద్ధి అవసరమనుకొంటే సంక్షేమ పధకాలు లబ్దిదారులు కూడా టిడిపికే ఓట్లు వేయవచ్చు. మా సంక్షేమ పధకాలు మాకు వస్తే చాలనుకొంటే వారందరూ వైసీపీకే ఓట్లు వేయవచ్చు.

కనుక వచ్చే ఎన్నికలను అభివృద్ధికి, సంక్షేమ పధకాలకి మద్య జరుగబోయేవిగా చూడవచ్చు. అయితే రాష్ట్రంలో సంక్షేమ పధకాలకు అర్హులు కానివారు లేదా వాటిని పొందలేనివారు కూడా వాటి భారం చార్జీలు, పన్నుల పెంపు రూపంలో భరించాల్సివస్తోంది. రాష్ట్ర జనాభాలో సుమారు 50-60 శాతం అటువంటివారే ఉన్నారు. వారిలో కూడా మళ్ళీ వైసీపీ, టిడిపిల మద్య చీలిపోయి ఉండవచ్చు.

ఇక రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారినా ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడుతుంది. టిడిపి, వైసీపీలు ఒంటరిగా, బిజెపి, జనసేనలు కలిసి పోటీ చేస్తే ఎన్నికల ఫలితాలు ఒకలా ఉంటాయి. అదే టిడిపి, జనసేన, బిజెపిలు కలిసి పనిచేస్తే ఫలితాలు మరోలా ఉంటాయి. ఈ కూడికలు తీసివేతలు, ఇంకా ఎన్నికలలోపు రాష్ట్రంలో జరిగే సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిణామాలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని చూస్తే వచ్చే ఎన్నికలలో ఏకపక్షంగా జరగవని చెప్పవచ్చు. అంటే, ప్రధాన పార్టీలైన టిడిపి, వైసీపీల మద్య చాలా తీవ్రమైన పోటీ తప్పదని స్పష్టం అవుతోంది.