Chandrababu Naidu- visiting flood areas in krishna and Guntur Districtsకృష్ణగుంటూరు జిల్లాల ప్రజలు వరదల వల్ల ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమెరికా యాత్రకు వెళ్లడం విమర్శలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరోపక్క ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం కృష్ణానది వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని గీతానగర్‌ తదితర ప్రాంతాల్లో పార్టీ నాయకులతో కలిసి పర్యటిస్తున్నారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారు.

నాయకుల, క్యాడర్ హడావిడికి దూరంగా చంద్రబాబు ఎక్కువగా బాధితులతో మాట్లాడటానికి ప్రాధాన్యత ఇస్తుండడం గమనార్హం. బాధితులు చాలా మంది మాజీ ముఖ్యమంత్రి వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. టీడీపీ హయాంలో విపత్తుల సమయంలో ప్రభుత్వ యంత్రంగం సమర్ధవంతంగా పనిచేసి తమకు అండగా ఉండేదని, ఇప్పుడు ఆ భరోసా లేకుండా పోయిందని, తమను పట్టించుకునే వారే లేకుండా పోయారని వారు చంద్రబాబుకు చెప్పుకుని వాపోయారు.

తన పర్యటన అనంతరం చంద్రబాబు మీడియాతో సమావేశమయ్యే అవకాశముంది. అంతకుముందు హైదరాబాద్ నుంచి స్పైస్‌జెట్‌ విమానంలో గన్నవరం చేరుకున్న చంద్రబాబుకు పార్టీ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆయన విజయవాడ చేరుకున్నారు. గత కొద్ధి రోజులుగా చంద్రబాబు విపరీతమైన చెయ్యి నొప్పితో బాధ పడుతుంటే వైద్యులు ఆయనకు బెడ్ రెస్ట్ చెప్పడంతో ఆయన హైదరాబాద్ లోని కుటుంబసభ్యుల దగ్గరకు వెళ్లిన సంగతి తెలిసిందే.