chandrababu naidu visited ISB on completing 20 yearsమాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి అపూర్వమైన గౌరవం లభించింది. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) ద్విశతాబ్ధి ముగింపు వేడుకలకి ముఖ్య అతిధిగా హాజరైనప్పుడు, దానిలో చదువుకొని దేశవిదేశాలలో పెద్ద పెద్ద సంస్థలను ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్ధులు, ఆ సంస్థ ప్రారంభం నుంచి పనిచేస్తున్న ఫ్యాకల్టీ, సిబ్బంది, ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు విద్యావేత్తలు చంద్రబాబు నాయుడుని ప్రశంశలతో ముంచెత్తారు.

ఆనాడు చంద్రబాబు నాయుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఈ సంస్థని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం వలననే తమందరికీ ఓ అద్భుతమైన జీవితానికి బాట పడిందని అన్నారు. గత 20 ఏళ్ళుగా ఐఎస్‌బి వేలాదిమంది విద్యార్థులు చదువుకొన్నారని, యావత్ భారతదేశం గర్వపడేవిదంగా ప్రపంచం నలుమూలలో అత్యున్నత స్థాయిలో స్థిరపడ్డారని పూర్వ విద్యార్థులు, ఫ్యాకల్టీ చంద్రబాబు నాయుడుని ప్రశంశించారు. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు అనేకమంది లేచి నిలబడి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కూడా స్పూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. ఆనాడు తాను హైదరాబాద్‌లో ఐఎస్‌బి ఏర్పాటుచేయాలనుకొన్నప్పుడు చాలామంది తనని వెనక్కు లాగారని కానీ ఐఎస్‌బిని ఏర్పాటు చేస్తే భవిష్యత్‌ ఏవిదంగా ఉండబోతోందో తాను ఊహించగలిగాను కనుక వెనక్కు తగ్గలేదన్నారు. తన నిర్ణయం సరైనదేనని నేడు మీరందరూ నిరూపించి చూపారని అన్నారు. అలాగే హైదరాబాద్‌కి హైటెక్ సిటీ ఏర్పాటు చేసి, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ కంపెనీలని రప్పించడానికి తాను అమెరికా వీధుల్లో తిరుగుతూ ఎంతగా శ్రమించానో ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మరోసారి గుర్తుచేసుకొంటున్నప్పుడు ఆడిటోరియం కరతాళధ్వనులతో మారుమ్రోగుతూనే ఉంది. అందరూ మద్యలో లేచి నిలబడి చంద్రబాబు నాయుడుకి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి ఆయన పట్ల తమ గౌరవం చాటుకొన్నారు. చంద్రబాబు నాయుడు కూడా అంతే హుషారుగా స్పందిస్తూ, “మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఈరోజు గురించో లేదా రేపటి గురించో కాదు. మరికొన్నేళ్ళ తర్వాత మనం ఏం చేయాలి? ఎక్కడ ఉండాలి? మనం ఈ దేశానికి రాష్ట్రానికి ఇంకా ఏం చేయగలము? అని ఆలోచించాలి. ఈ ఐఎస్‌బిలో చదువుకొన్న ప్రతీఒక్కరికీ ఆ విజనరీ ఉండాలి,” అని అన్నారు.

సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు నిత్యం ఆయనని నానా మాటలు అంటూనే ఉన్నారు. కానీ గంధం చెట్టువంటి చంద్రబాబు నాయుడు విలువ, గౌరవం ఎన్నడూ తగ్గదని ఐఎస్‌బిలో చదువుకొని దేశవిదేశాలలో అత్యున్నత స్థానాలలో స్థిరపడిన పూర్వ విద్యార్దులు చాటి చెప్పారు.