Chandrababu naidu to visit merger mandals in andhra pradeshటీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు కీలక పర్యటనకు బయలుదేరుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలో కలిసిన విషయం తెలిసిందే. ఈ ఏడు మండలాల్లో కొన్ని తూర్పుగోదావరి జిల్లాలో, మరికొన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం కాగా, ఇప్పటివరకు ఈ మండలాల్లో చంద్రబాబు అడుగు పెట్టలేదు.

నిషేధిత మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో పర్యటించడం అంత శ్రేయస్కరం కాదని పోలీసు అధికారులు చెబుతూ వస్తున్నారు. అయితే మొన్నటిదాకా పోలీసు అధికారుల మాట వింటూ వస్తున్న చంద్రబాబు తాజాగా ముంపు మండలాల్లో పర్యటనకే మొగ్గు చూపారు. ఏది ఏమైనా సదరు మండలాలలో తాను పర్యటించి తీరాల్సిందేనని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో ముంపు మండలాలలో పర్యటిస్తున్న చంద్రబాబు, పలు అబివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అంతేకాక స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కీలక ప్రసంగం చేయనున్నారు. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో చంద్రబాబు అడుగుపెడుతున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.