Sakshi office hyderabadఅసెంబ్లీ వేదికగా ‘కాల్ మనీ’ అంశంపై దినపత్రికలను చదువుతూ జగన్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహానికి కారణమయ్యాయి. ఫోటోలను ఉదహరిస్తూ ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కధనాలను చదివి వినిపించిన జగన్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు, “ఏ మీడియా అయినా ఇష్టారహితంగా వ్యవహరించకూడదని, బాధ్యతతో ఉండాలని సూచిస్తూ, ఒకవేళ మీడియా సంస్థల దగ్గర వారు ప్రచురించినట్లుగా సాక్ష్యాలు ఉన్నట్లయితే, వాటిని ఖచ్చితంగా ఈ కేసులో వినియోగించుకుంటామని, లేకుంటే దానికి సంజాయిషీ ఇచ్చుకునేలా నోటీసులు ఇస్తామని స్పష్టం చేసారు. దీంతో అప్పటివరకు గొంతు చించుకుని ప్రసంగిచిన జగన్, చివరకు నాలుక కరచుకోవాల్సి వచ్చింది.

‘కాల్ మనీ’ అంశాన్ని ఉదహరిస్తూ, 200 ఆడియో టేప్ క్యాసెట్లు ఉన్నాయని, ఈ కేసులో ఇవే అసలు సాక్ష్యలంటూ ‘సాక్షి’ పత్రికలో ప్రముఖంగా ప్రచురితమైన విషయం తెలిసిందే. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కేసులు నమోదు చేయడానికి సరైన సాక్ష్యాలు లేవంటూ అధికార పార్టీ వర్గీయులు ప్రసంగించడంతో జవాబిచ్చిన జగన్, 200 ఆడియో క్యాసెట్ల అంశాన్ని లేవనెత్తారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇంటెలిజెన్స్ డీజీల ఫోటోలపై కూడా కధనాలను చదివి వినిపించారు. ఈ పర్యవసానాలతో మీడియా బాధ్యతను ప్రస్తావిస్తూ… ‘’కాల్ మనీ’’ కేసులో సాక్ష్యాల కధనాలు ప్రసారం చేసిన అన్ని మీడియాలకు నోటీసులు అందిస్తామని ప్రకటించారు.

“నేలకు పోయేది…. నెత్తికి రాసుకోవడమంటే… ఇదే” అన్న చందంగా వైసీపీ అధినేత వ్యాఖ్యలు మారాయని, జగన్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఉపయోగపడటం అటుంచితే, ఇపుడు తన మీడియా సంస్థను కూడా తానే ఇరుకున పెట్టుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.