Nitin Gadkari  Chandrababu Naiduపోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అడ్డుపడుతుంది అన్నట్టు చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించడంతో ఆత్మరక్షణలో పడింది ఆ పార్టీ. దిద్దుబాటు చర్యలలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును రాష్ట్ర బీజేపీ నేతలు కాసేపటి క్రితం కలిశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై గందరగోళ పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.

దీంతో ముఖ్యమంత్రిని కలవాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. పోలవరం, రాష్ట్రానికి రావాల్సిన ఇతర ప్రాజెక్టులపై వీరిమధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. ప్రాజెక్టుకు సంబందించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం దగ్గర్నుంచి తీసుకుని ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, జలవనరుల శాఖ మంత్రిని కలవాలని రాష్ట్ర బీజేపీ నేతలు నిర్ణయించారు.

మరోవైపు చంద్రబాబు కూడా సాయంత్రం ఢిల్లీ వెళ్లి జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరిని కలవనున్నారు. స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులకు పిలిచిన టెండర్లు, టెండర్‌ నిబంధనలు, అవగాహన ఒప్పందంలో ఉన్న అంశాలు ఇతర విషయాలపై గడ్కరీతో సమగ్రంగా చర్చించాలని చంద్రబాబు భావిస్తున్నారు.