Chandrababu Naidu to copy rythu bandhu schemeఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల పై వరాల జల్లు కురిపిస్తుంది. ఇప్పటికే అన్ని రకాల పెన్షన్లను రేటింపు చేసిన చంద్రబాబు, ఇప్పుడు డ్వాక్రా గ్రూపులకు రూ. 10వేలు ఆర్థికసాయం, రైతులకు పెట్టుబడి సాయం పథకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. రైతులకు పెట్టుబడి సాయం అనగానే వెంటనే గుర్తు వచ్చేది తెలంగాణలోని రైతు బంధు పథకమే. అయితే ఆ మార్కు తన మీద పడకుండా జాగ్రత్త పడుతున్నారు చంద్రబాబు.

రైతుబంధు మాదిరి కాకుండా కౌలు రైతులకూ వర్తింపు చేయాలని భావిస్తోంది. కౌలు రైతులకు ఈ పథకం అమలు చెయ్యడం జరగని పని అని కేసీఆర్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. భూ యజమానులకు పొలం దస్తావేజులు, పాస్ పుస్తకాలు ఉంటాయి కాబట్టి లబ్దిదారులను ఎంపిక చేయడం తేలిక. రెండు తెలుగు రాష్ట్రాలలో కౌలు రైతులు నోటి మాట మీదే వ్యవసాయం చేసుకుంటారు. వీరికి ఎటువంటి రాత కోతలు ఉండవు. కావున లబ్ది దారులను గుర్తించడం కష్టమే.

ఒకవేళ కౌలు రైతులకు సాయం అందిస్తే భూ యజమానులకు సాయం ఇవ్వకూడదు. అటువంటి పక్షంలో వారి ఆగ్రహానికి ప్రభుత్వం గురి కావాల్సి వస్తుంది. అలాగని ఒకే భూమి మీద రెండు సార్లు పెట్టుబడి సాయం చెయ్యడము కరెక్టు కాదు. ఒకవేళ అటువంటి ప్రయత్నం చేస్తే అందరూ రెండు రకాలుగానూ రిజిస్టర్ అయ్యి పథకం ఉద్దేశం పక్క దారి పడుతుంది. ఈ క్రమంలో భూ యజమానులకు, కౌలు దారులకు కూడా సాయం ఎలా అందిస్తారో చూడాలి. ఒక వేళ నిజంగా ఆ పని చేస్తే చంద్రబాబు కేసీఆర్ కంటే గ్రేట్ అనే అనాలి.

తెలంగాణలో మొన్నటిదాకా ప్రతి ఎకరాకు పంటకు 4000 చప్పున ఏడాదికి 8000 ఇచ్చేది ప్రభుత్వం. ఇటీవలే ఆ అమౌంట్ ను 10000 కు పెంచుతామని చెప్పి ఎన్నికలకు వెళ్ళింది తెరాస. తొందర్లో అమలు చేయబోతుంది. అయితే మిగులు రాష్ట్రమైన తెలంగాణతో పోటీ పడి ఆంధ్రప్రదేశ్ ఈ పధకాన్ని ఎలా అమలు చేస్తుంది అనేది కూడా చూడాలి. మరో పక్క రైతు రుణ మాఫీకి కూడా ప్రభుత్వం బ్యాంకుల వద్ద అప్పు చేస్తుంది. అయితే ఎన్నికల ముందు ప్రభుత్వాలకు చేతికి ఎముక లేనట్టుగా ప్రజలకు తాయిలాలు ప్రకటించడం మాములే కదా