Chandrababu-Tenali-Road-Showటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వయసు 72 ఏళ్ళు. సాధారణంగా ఈ వయసులో రాజకీయ నేతలు వీలైనంత వరకు పార్టీ కార్యాలయాలలో సమావేశాలకు అప్పుడప్పుడు బహిరంగసభలతో సరిపెట్టుకొంటుంటారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఇంత వయసు వచ్చినా తగ్గేదేలే అంటూ జిల్లా పర్యటనలు చేస్తూ నిత్యం ప్రజల మద్యనే ఉంటున్నారు.

మొదట తిరుపతి, కర్నూలు తర్వాత అనంతపురం, పల్నాడు, అమరావతి, వాటి తర్వాత ఉభయగోదావరి జిల్లాలలో వరుసగా పర్యటిస్తూ ఎక్కడికక్కడ రోడ్ షోలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యి దిశా నిర్దేశం చేస్తూనే ఉన్నారు.

బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుండగానే “ఇదేం ఖర్మ రాష్ట్రానికి?” అనే మరో సరికొత్త నిరసన కార్యక్రమాన్ని ఇటీవల మంగళగిరిలో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ నెల 8,9 తేదీలలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో, 10వ తేదీన ప్రకాశం జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు.

ముందుగా 8వ తేదీ ఉదయం తెనాలిలో రోడ్ షో, బహిరంగసభలో పాల్గొంటారు. మర్నాడు అంటే డిసెంబర్‌ 9వ తేదీ ఉదయం పొన్నూరునుంచి బాపట్ల వరకు రోడ్ షోలో పాల్గొంటారు. ఆ తర్వాత పొన్నూరు, బాపట్ల, చీరాలలో పర్యటించి రాత్రి చీరాలలో బస చేస్తారు. మర్నాడు సంతనూతలపాడు, తర్వాత పరుచూరు నియోజకవర్గంలో రోడ్ షో, బహిరంగసభలో పాల్గొంటారు.

వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులతో రాయలసీమ, ఉత్తరాంద్ర జిల్లాలలో విద్వేషాలు రాజేసినప్పటికీ చంద్రబాబు నాయుడు రాయలసీమ జిల్లాలోపర్యటించినప్పుడు ప్రజలు నీరాజనాలు పట్టారు. అంటే ఈ సాకుతో టిడిపిని రాజకీయంగా దెబ్బతీయాలనే వైసీపీ ఆలోచనలు ఫలించలేదన్న మాట! చంద్రబాబు నాయుడు ఎలాగూ అమరావతినే రాజధానిగా చేస్తానని చెపుతున్నారు కనుక కృష్ణ, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలలో ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలుకుతున్నారు.

సిఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలకి వెళ్తే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక వైసీపీ నేతలు పూనుకొని జనసమీకరణ చేయాల్సివస్తోంది. కానీ చంద్రబాబు నాయుడు పర్యటనలకి టిడిపి నేతలు కనీసం వాహనాలు కూడా ఏర్పాటు చేయకపోయినా జనాలు స్వచ్ఛందంగా తరలివస్తుండటం గమనిస్తే ప్రజలు మార్పు కోరుకొంటున్నట్లు అర్దమవుతోంది.