Chandrababu - Naidu -TDP-YS- Jagan -YSRCPమొన్న ఆ మధ్య చంద్రబాబు నాలుగు సార్లు సర్వే చేయించి చెబుతున్నా విజయం మనదే తమ్ముళ్లు అంటే వైఎస్సార్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ విజయసాయి రెడ్డికి కోపమొచ్చేసింది. గెలిచే వారైతే నాలుగు సర్వేలు ఎందుకు అని లాజిక్ లేకుండా ఎద్దేవా చేశారు. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఎన్నికల తరువాత జగన్ మోహన్ రెడ్డి ఐదు సర్వేలు చేయించారని సమాచారం. ఆ ఐదు సర్వేలు తరువాత ఆయన అధికారంలోకి రావడంపై ధీమాగా ఉన్నారని వైకాపా వర్గాల సమాచారం.

మొదటి సర్వే వైఎస్సార్ కాంగ్రెస్ కు ప్రతికూలంగా రావడంతో సాంపిల్స్ పెంచుకుంటూ ఇంకా పకడ్బందీగా సర్వేలు చేయించారని… ఈ సారి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆ తరువాతి సర్వేలలో ఏ ఒక్కదానిలో కూడా 100 సీట్లకు తగ్గలేదని అని ఆ పార్టీ నాయకులు నిన్న విజయవాడలో జరిగిన కౌంటింగ్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమంలో కింద స్థాయి నాయకులకు చెప్పారట. దీనితో 23కు ముందు వారు మరింత ధీమాగా ఉన్నారు.

ఈ సారి ఎన్నికలలో గెలుపు అనేది వైఎస్సార్ కాంగ్రెస్ కు చాలా కీలకం. ఒక్క ప్రాంతీయ పార్టీ రెండు పర్యాయాలు అధికారంలో లేకుండా మనగలగడం అసంభవం. దీనితో జగన్ దీనిని జీవన్మరణ సమస్యగా తీసుకుని పని చేశారు. 3500 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారు. వందల కోట్లు పెట్టి ప్రశాంత్ కిషోర్ టీం ను రంగంలోకి దించారు. గెలుపు కోసం చెయ్యాల్సింది అంతా చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి అవ్వాలనే ఆయన కల నెరవేరుతుందో లేదో చూడాలి మరి.