Chandrababu Naidu TDP revolt on BJPపార్లమెంటులో బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీలను దారిలో ఉంచడానికి బీజేపీ మూడంచెల వ్యూహాన్ని అమలు చేసింది. తొలుత దబాయింపు, బెరింపులకు దిగింది. టీడీపీ తగ్గకపోవడంతో ఆ తర్వాత సంప్రదింపులకు దిగి, చివరకు సముదాయింపులకు దిగింది. బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టిన రోజున పార్లమెంట్ హాల్లో కొందరు పాత్రికేయులతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఏపీ రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు కావాలని ఆయన అడుగుతారు. అంత డబ్బు ఎవరిస్తారు? ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అంటూ జైట్లీ మండిపడ్డారు. ఏపీకి ఇప్పటికే చాలా నిధులు ఇచ్చామని.. ఏయే పద్దుల కింద ఎన్ని డబ్బులు ఇచ్చామో లెక్కలు చూపిస్తామని… అప్పుడు వాళ్లే ఇబ్బంది పడతారని హెచ్చరించారు. రెవెన్యూ లోటును కూడా ఏపీ ప్రభుత్వం ఎక్కువ చేసి చూపెడుతోందని… వాళ్లు అడిగినన్న డబ్బులు ఇవ్వబోమని స్పష్టం చేశారు.

ఈ బెదిరింపుల విషయం కాస్తా చంద్రబాబుకు తెలిసిపోయింది. దీంతో, ఆందోళనలు ఉద్ధృతం చేయాలంటూ తమ ఎంపీలను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గొద్దని… ఆందోళనలతో ఉభయ సభలు అట్టుడికిపోవాలని చెప్పారు. ఊహించని విధంగా పరిస్థితులు మారడంతో… బీజేపీ పెద్దలు రూటు మార్చారు. టీడీపీతో బీజేపీ ఎంపీలు సంప్రదింపులకు దిగారు.

చంద్రబాబుతో సాక్షాత్తు బీజేపీ అధినేత అమిత్ షా, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ లు పోన్లు చేసి మాట్లాడారు. ముద్దుకృష్ణమనాయుడి భౌతికకాయానికి నివాళి అర్పించేందుకు చంద్రబాబు వెళ్లినప్పుడు… అర్జెంట్ గా మాట్లాడాలంటూ అమిత్ షా ఫోన్ చేశారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని… ఎలాంటి సందేహాలను పెట్టుకోవద్దని… ప్రధాని ప్రసంగానికి అడ్డు తగలవద్దని చంద్రబాబును కోరారు.

ఈ నేపథ్యంలో, తన ప్రసంగంలో మోడీ ఏదైనా ప్రకటన చేస్తారేమో అనే భావనతో ఆయన ప్రసంగం సమయంలో టీడీపీ ఎంపీలు తమ సీట్లలో కూర్చున్నారు. అంతకు ముందే చంద్రబాబుపై విమర్శలు చేసిన సోము వీర్రాజుకు అమిత్ షా ఫోన్ చేసి క్లాసు తీసుకున్నారు. చంద్రబాబుపై మాట్లాడే హక్కు ఎవరిచ్చారంటూ మండిపడటమే కాకుండా… మరోసారి ఇది రిపీట్ అయితే సహించబోమంటూ వార్నింగ్ ఇచ్చారు.

మరోవైపు, ఇదే సమయంలో ఢిల్లీ నుంచి వస్తున్న కాల్స్ తో చంద్రబాబు చలించలేదు. తమ పోరాటం వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవని… ఇచ్చిన హామీలను నెరవేర్చమనే కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. దీంతో బీజేపీ పెద్దలకు మరో డౌట్ కూడా వచ్చింది. ఇతర పార్టీల నేతలతో చంద్రబాబు ఏవైనా సంప్రదింపులు జరుపుతున్నారా? అనే కోణంలో ఆరా తీశారు. అలాంటిది ఏమీ లేదనే నిర్ధారణకు వచ్చిన తర్వాత… ఏపీ కోసం తమ వంతు ప్రయత్నం చేస్తామని కసరత్తును ప్రారంభించారు.

విభజన హామీల అమలు బాధ్యతను చూస్తున్న రాజ్ నాథ్ సింగ్ గురువారం నాడు మూడు గంటల సేపు దీనిపై భేటీ నిర్వహించారు. సంబంధిత అధికారులను పిలిపించుకుని… ఏయే హామీ ఏ దశలో ఉందో చర్చించారు. అయితే సభలో మూడుసార్లు జైట్లీ ప్రకటన చేసినా… ప్రతిసారీ పాత లెక్కలే చెప్పారు. దీంతో, టీడీపీ ఫైర్ అయింది. సమావేశాలు ముగిసే వరకు తన ఆందోళనలు కొనసాగించింది.

ఏపీ ఎంపీల ఆందోళనల మధ్యే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అనంతరం శనివారం నాడు సాయంత్రం ఏపీకి కేంద్ర ప్రభుత్వం కొంతమేర నిధులను ప్రకటించింది. 14వ ఆర్థిక సంఘం కింద 369 కోట్లు, జాతీయ ఉపాధి హామీ పథకం కింద మరో 31.76 కోట్లను విడుదల చేస్తున్నట్టు తెలిపింది.