Chandrababu-Naidu-TDP-Elections-2024గత ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామని ఏపీ ప్రజలు భావించడం వల్లనైతేనేమీ, చంద్రబాబు నాయుడు రాజకీయంగా తప్పటడుగులు వేయడం వల్లనైతేనేమీ టిడిపి ఘోరంగా ఓడిపోయింది. అయితే ఆ ఎన్నికలో అనేక నియోజకవర్గాలలో టిడిపి అభ్యర్ధులు కొద్దిపాటి తేడాతో ఓడిపోయారు. అంటే అక్కడ ఎన్నికల వ్యూహాలు సరిగా లేకపోవడం లేదా వాటిని అమలు చేయడంలో టిడిపి వైఫల్యం చెందడం వలననే ఓడిపోయిందని అర్దమవుతోంది. అటువంటి నియోజకవర్గాలు విజయనగరం నియోజకవర్గం కూడా ఒకటి.

విజయనగరం ప్రజలకు అశోక్ గజపతిరాజు కుటుంబమంటే నేటికీ చాలా గౌరవభావం ఉంది. అయితే గత ఎన్నికలో అశోక్ గజపతిరాజు లోక్‌సభకి పోటీ చేయగా ఆయన కుమార్తె అధితి శాసనసభకి పోటీ చేసి ఇద్దరూ ఓడిపోయారు. అంతకు ముందు ఆయన విజయనగరం నుంచి శాసనసభకి పోటీ చేసినప్పుడు సుమారు 25 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. కానీ 2019 ఎన్నికలలో ఆ స్థానంలో కుమార్తెని బరిలో దింపి తాను లోక్‌సభకి పోటీ చేసినప్పుడు ఆమె సుమారు 6,417 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైసీపీ అభ్యర్ధి కోలగట్ల వీరభద్రస్వామికి 78,849 ఓట్లు రాగా అధితికి 72,432 ఓట్లు వచ్చాయి. అంటే అక్కడ అభ్యర్ధులని మార్చడం వలననే టిడిపి ఓడిపోయినట్లు స్పష్టం అవుతోంది.

అదేవిదంగా శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావుకి 84,084 ఓట్లు రాగా టిడిపి అభ్యర్ధి గూండా లక్ష్మీదేవికి 78,307 ఓట్లు వచ్చాయి. ఆమె 5,777ఓట్ల తేడాతో ఓడిపోయారు. యలమంచిలిలో టిడిపి అభ్యర్ధి పంచకర్ల రమేష్ బాబు 4,146 ఓట్లతో, పెద్దాపురంలో టిడిపి అభ్యర్ధి తోట సరస్వతి 4,027 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

నగరి టిడిపి అభ్యర్ధి గాలి భాను ప్రకాష్ 2,708 ఓట్లతో, తిరుపతిలో టిడిపి అభ్యర్ధి ఎం.సుగుణ కేవలం 708 ఓట్లు తేడాతో ఓడిపోయారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసిన టిడిపి సీనియర్ నాయకుడు బొండా ఉమా కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోవడం జీర్ణించుకోవడం చాలా కష్టమే. కానీ ఓటమి ఓటమే! దాని నుంచి గుణపాఠం నేర్చుకొని ముందుకు సాగక తప్పదు. టిడిపి అదే చేస్తోంది.

గత ఎన్నికలలో వైసీపీ ప్రభంజనం వీచినప్పుడే వైసీపీకి ఓటింగ్ శాతం 49.95 కాగా టిడిపికి 39.17 శాతం సాధించింది. అంటే తేడా కేవలం 10.78 శాతం మాత్రమే అన్నమాట! ఇక పోలైన ఓట్లు పరంగా చూసుకొన్నట్లయితే వైసీపీకి మొత్తం 1,56,88,569 ఓట్లు పోలవగా, టిడిపికి 1,23,04,668 ఓట్లు పోల్ అయ్యాయి. అంటే 3,38, 3,901 ఓట్ల తేడాతో ఓడిపోయిందన్న మాట!

కనుక స్వల్ప తేడాతో ఓడిపోయిన అన్ని స్థానాలపై ఈసారి టిడిపి ఫోకస్ పెట్టి అక్కడ జరిగిన లోపాలను గుర్తించి సవరించుకొని ఎన్నికలని ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికలు సిద్దం చేసుకొంటోంది. కనుక ఈసారి టిడిపి నుంచి వైసీపీకి మరింత గట్టి పోటీ ఉంటుందని సిఎం జగన్మోహన్ రెడ్డి గ్రహించినందునే మంత్రులు, ఎమ్మెల్యేలు గడప గడపకి కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొవాలని లేకుంటే నిర్ధాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తానని పదేపదే హెచ్చరిస్తున్నారనుకోవచ్చు. ఈ మూడున్నరేళ్ళ జగన్‌ పాలనతో వేసారిపోయిన ప్రజలు, ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారు.