Chandrababu-Naidu-Has-His-Plate-Full-for-Two-Yearsఇటీవలే జరిగిన ఎన్నికలలోని ఘోర పరాజయం నుండి బయటకు రావడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశ్వప్రయత్నం చేస్తున్నట్టు ఉన్నారు. శ్రేణులు ఆత్మస్థయిర్యం కోల్పోకుండా వారిని స్థానికి ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల అనంతరం జరుగుతున్న హింస, వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల చేతిలో మరణించిన కార్యకర్తల కుటుంబాలను కలుస్తున్నారు. వారికి ఆర్ధిక సాయం కూడా పార్టీ తరపున అందిస్తున్నారు చంద్రబాబు.

పార్టీ ఇప్పుడు ఉన్నట్టుగా నిస్తేజంలోనే ఉంటె తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలలో తుడుచుపెట్టుకుని పోవడం ఖాయం. సహజంగా ఇటువంటి ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. పైగా ఎన్నికలు జరిగిన వెంటనే, అది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ కు ఇటువంటి భారీ విషయం తరువాత జరిగేవి కాబట్టి వారికి ఇంకా సానుకూలత ఉంటుంది. ఈ తరుణంలో చంద్రబాబు జరగబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించి నష్టనివారణ చర్యలు చేపడుతున్నారు.

మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత తొందరలో ఈ ఎన్నికలు జరిపించాలని కోరుకుంటుంది. కార్యకర్తలు జోష్ లో ఉండగానే అత్యధిక సీట్లు కైవసం చేసుకుని టీడీపీని మరింత నిరాశానిస్పృహలలోకి నెట్టాలని చూస్తుంది. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇటీవలే జరిగిన ఎన్నికలలో టీడీపీ కేవలం 23 ఎమ్మెల్యే సీట్లు, మూడు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ చరిత్రలో ఇదే ఘోరమైన ఓటమి.