Nara-Chandrababu-Naidu-interacts-with-young-minds-of-IIT-Bombayగత 4 రోజులుగా అమరావతిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబంతో దీపావళి జరుపుకోవడానికి గాను శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు మార్గమధ్యంలో నిలిచిపోయింది. అమరావతి నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో వెళ్తున్న సమయంలో కారుకు సమస్య ఎదురైంది.

నార్కెట్‌పల్లి వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న కారుకు ‘క్లచ్‌’ సమస్య తలెత్తింది. దీంతో కారు నిలిచిపోయింది. ఈ క్రమంలో సుమారు 20 నిముషాలపాటు చంద్రబాబు రోడ్డుపైనే ఉండిపోయారు. జెడ్ కేటగిరీ వీఐపీ కావడంతో ఆ 20 నిముషాలు భద్రతా దాళాలు అప్రమత్తం అయ్యాయి. ఆ కొంత సేపు టెన్షన్ గా గడిపాయి.

తర్వాత మరో కారును సిద్ధం చేసుకొని దానిలో ఆయన ప్రయాణం కొనసాగించారు. జెడ్ కేటగిరీ వీఐపీకి కనీస ప్రమాణాలు ఉన్న కారుని ప్రభుత్వం కేటాయించకపోవడం విశేషం. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నక్సలైట్ల హిట్ లిస్ట్ లో ఉన్న చంద్రబాబు భద్రత పట్ల ఉదాసీనత పనికిరాదని ప్రభుత్వానికి హితవు పలుకుతున్నారు.

మరోవైపు… దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చాలని కొన్ని రాజకీయ పార్టీలు, కాల్చకూడదని కొన్ని రాజకీయ పార్టీలు చెబుతున్న తరుణంలో టీడీపీ అటువంటి వివాదానికి దూరంగా ఉంది. రాష్ట్ర ప్రజలకు ట్విట్టర్ ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ఆ విషయం జోలికి పోలేదు. “ఈ దీపావళి మీ ఇంట శుభాలు పూయించాలని కోరుకుంటూ.. మీ ఇంటిల్లిపాదికీ పండుగ శుభాకాంక్షలు,” అని మాత్రమే చెప్పి ఊరుకున్నారు.