Chandrababu-naidu-TDP-Gannavaram-vamsi-vallabhanenniరాజకీయాల్లో చావోరేవో తేల్చుకోవాల్సిన సందర్భాలు ఏర్పడినప్పుడు ఆయా పార్టీ అధినేతలు చాలా కఠినమైన నిర్ణయాలే తీసుకుంటారు. ఈ నిర్ణయాల వల్ల కొందరికి బాధ కలిగినా వెనకడుగు వేయకుండా గెలుపే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతారు. తీసుకున్న నిర్ణయంలో ఏ మాత్రం లోపం ఉన్నా భారీ మూల్యాన్ని చెల్లించుకునే పరిస్థితి తలెత్తుతుంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తుంటారు పార్టీల అధినేతలు.

ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు కి అలాంటి సవాలే ఎదురైన పరిస్థితి. బాబు మరియు ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన వారిలో కొడాలి నాని , వల్లభనేని వంశీ ల పేర్లే ప్రధానంగా వినబడతాయి. వయస్సు తారతమ్యం చూడకుండా, రాజకీయ విమర్శలను పక్కన బెట్టి, వ్యక్తిగతంగా బాబుపై వీరిద్దరూ విరుచుకుపడ్డ తీరు అంతా ఇంతా కాదు అనే విమర్శలే పార్టీలకు అతీతంగా వినిపిస్తున్న పరిస్థితి.

అయితే మానవతా విలువలు మర్చిపోయి వ్యక్తిగతంగా తనని టార్గెట్ చేసిన వారికి గెలుపుతోనే సమాధానం చెప్పి వారి అహంకారాన్ని దించాలని బాబు గట్టి స్కెచ్చే వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే గుడివాడ అభ్యర్ధిపై ఓ క్లారిటికి వచ్చిన బాబు, ప్రస్తుతం గన్నవరంపై కూడా దృష్టిపెట్టారని తెలుస్తుంది. దీనికోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించడంతో పాటు ఇద్దరి అభ్యర్థులను ఖరారు చేయాలని బాబు అనుకుంటున్నట్లు పార్టీలో చర్చ జోరుగా సాగుతుంది.

గన్నవరంలో వల్లభనేని వంశీకి వ్యక్తిగతంగా ఇమేజ్ ఉంది. ఎంత ఇమేజ్ ఉన్నా ఖచ్చితంగా గెలిపించేంత కాదు అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. గడిచిన ఎన్నికల్లో టీడీపీ నుండే గెలుపొందిన వంశీకి వ్యక్తిగత ఇమేజ్ తో పాటు టీడీపీ శ్రేణులు పూర్తి సహకారం అందించడం, బాబు వ్యూహాలు ఫలించడం వల్లే వంశీ స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారనే వ్యాఖ్యలు టీడీపీ నేతల నుండి వస్తున్నాయి. కానీ వంశీ టిడిపి నుండి గెలిచి అధికార వైసీపీతో సఖ్యతగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గన్నవరం అభ్యర్థిగా వంశీ నే అనేది దాదాపు ఖరారైపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో గన్నవరంలో వంశీని ఓడించి తీరాలి అనే పట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు తో ఆ నియోజకవర్గ టీడీపీ శ్రేణులంతా గట్టి పట్టుదలతో ఉన్నారంట. అందుకు వంశీకి ధీటుగా బలమైన అభ్యర్థిని పెట్టాల్సిందిగా బాబుకి గన్నవరం నేతలు వినతులు కూడా ఇస్తున్నారట. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అభ్యర్థిని ఖరారు చేసే పనిలో పడ్డారట బాబు.

గన్నవరం నుండి టీడీపీ అభ్యర్థిగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని చందు తన తల్లి దేవినేని అపర్ణకి టికెట్ కేటాయించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. అదే సమయంలో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి కూడా గన్నవరం టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు తెలుస్తుంది. టీడీపీ క్యాడర్ బలంగా ఉన్నప్పటికి బలమైన వ్యక్తినే వంశీకి ప్రత్యర్థిగా నిలబడితే విజయం సాధించొచ్చు అని బాబు ఆలోచిస్తున్నారట.

యార్లగడ్డ వెంకట్రావ్ వైసీపీ తరుపున పోటీ చేసి వంశీకి గట్టి పోటీనే ఇచ్చారు. అయితే ఇప్పుడు వంశీ వైసీపీతో జతకట్టడంతో రాబోయే ఎన్నికల్లో గన్నవరం వైసిపి అభ్యర్థిగా వంశీనే బరిలో నిలవబోతున్నారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో వైకాపా నేతలైన యార్లగడ్డ వెంకట్రావ్, దుట్టా రామచంద్రరావు లు జగన్ పై తీవ్ర ఆగ్రహం, అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. వీరిద్దరూ బహిరంగంగానే వారి అసంతృప్తిని వ్యక్తపరిచిన సందర్భాలూ ఉన్నాయి.

అయితే యార్లగడ్డ వెంకట్రావ్ ని టీడీపీలోకి ఆహ్వానించి వంశీకి పోటీగా నిలబెట్టాలని బాబు యోచిస్తున్నట్లు తెలుస్తుంది. నియోజకవర్గంలో యార్లగడ్డ కు మంచి పట్టు ఉండటం, ఆర్ధికంగా కూడా బలంగా ఉండటం, గత ఎన్నికల్లో వంశీకి బలమైన పోటీ ఇవ్వడం లాంటి అంశాలు యార్లగడ్డ వైపు బాబు మొగ్గు చూపడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తుంది.

ఇక మరో అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ రావుని వంశీకి ధీటుగా నిలబెట్టాలని చూస్తున్నాట. గతంలో రామ్మోహన్ కి ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసి గెలిచిన నేపధ్యం ఉండటం, ఆర్ధికంగా కూడా బలంగా ఉండటం, నియోజకవర్గంలో పట్టు ఉండటం లాంటి అంశాలతో రామ్మోహన్ వైపు బాబు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తుంది.

యార్లగడ్డ, గద్దె లు మాత్రమే వంశీకి బలమైన పోటీ ఇవ్వగలరని, అందుకు వీరిద్దరిలోనే ఎవరో ఒకరిని ఖరారు చేయాలని బాబు యోచిస్తున్నట్లు టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్న పరిస్థితి. చంద్రబాబు ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేసినా తాము సిద్ధంగా ఉన్నాం అనే వ్యాఖ్యలు గన్నవరం టీడీపీ శ్రేణుల నుండి వినిపిస్తున్నాయి.

అస్సలు మిస్ అవ్వకుండా గన్నవరం లో గెలిచి తీరేలా బాబు గన్ షాట్ కొట్టబోతున్నారనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.