Chandrababu Naidu Sits On Road As Protestమాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని విశాఖపట్నం పోలీసులు హై డ్రామా మధ్య ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. విశాఖ వెస్ట్‌జోన్‌ ఏసీపీ పేరుతో సెక్షన్‌ 151 కింద ఆయనకు స్థానిక పోలీసులు నోటీసు ఇచ్చారు. ఆయన భద్రత దృష్ట్యా ముందస్తుగా అరెస్ట్‌ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

అనంతరం తీవ్ర ఉద్రిక్తత నడుమ రోడ్డు మీద బయటయించిన ఆయన్ను అదుపులోకి తీసుకుని తిరిగి విశాఖ విమానాశ్రయంలోనికి తరలించారు. వీఐపీ లాంజ్‌లో సుమారు అరగంటసేపు ఉంచే అవకాశముంది. ఆ తర్వాత చంద్రబాబును విమానాశ్రయం నుంచి విజయవాడ లేదా హైదరాబాద్‌ పంపిస్తారా? లేదా విశాఖలోనే ఇతర ప్రాంతానికి తరలిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

చంద్రబాబు గురించి అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడం, ఎయిర్ పోర్టు లోపలకు మిగతావారిని అనుమతించకపోవడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఇది ఇలా ఉండగా. 2017 జనవరి 26న విశాఖ పర్యటనకు నాటి ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చారు. అయితే ఎయిర్ పోర్టులోనే పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు.

ఎయిర్ పోర్టునుండే ఆయనను తిరిగి హైదరాబాద్ పంపించేశారు. సరిగ్గా అదే విధంగా చంద్రబాబుకు పరాభవం జరిపిస్తామని అధికారపార్టీ నేతలు, కార్యకర్తలు చెబుతుండడం విశేషం. అయితే దీనికి ప్రతిగా టీడీపీ శ్రేణులు ఏం చేస్తాయి అనేది చూడాల్సి ఉంది. పులివెందుల ఫ్యాక్షనిజం విశాఖకు తీసుకువస్తున్నారని, టీడీపీ ఇలాగే వ్యవహరించి ఉంటే జగన్‌ పాదయాత్ర జరిగేదా అని వారు ప్రశ్నిస్తున్నారు.