Chandrababu-Naidu-TDP-Annadata-Sukhibhava-Schemeఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ‘అన్నదాతా సుఖీభవ’ పేరుతో రైతుల కోసం చంద్రబాబు నాయుడు కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. తెలంగాణలోని రైతుబంధు వంటి ఈ పథకం ప్రకటించక ముందు చాలా హడావిడి చేసి చివరికి ఉసురు మనిపించారు. కేంద్రం ఇచ్చే 6000 సాయంతో పాటు రాష్ట్రప్రభుత్వం తరఫున రూ.4వేలు ఇవ్వాలని తీర్మానించింది. అయితే కేంద్రం కంటే రాష్ట్రం తక్కువ ఇవ్వడంతో ఈ స్కీం లో రావాల్సిన మైలేజ్ రాకుండా పోయింది. టీడీపీ అనుకూల మీడియా ముందు అంతా ఇంతా అని హడావిడి చెయ్యడంతో రైతులు తరువాత ప్రకటించిన పథకంతో నిరాశ చెందారు.

అయితే చంద్రబాబు దీనిని ప్రకటించిన నాలుగు రోజులలోనే కనిపెట్టేశారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వెంటనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి అన్నదాతా సుఖీభవకు కొత్త మార్గదర్శనాలు రూపొందించారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే మొత్తంతో సంబంధం లేకుండానే అయిదెకరాల్లోపు ఉండే సన్న, చిన్నకారు రైతు కుటుంబాలకు రూ.9వేల చొప్పున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 76 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో అయిదెకరాల లోపు ఉన్న రైతులు 65.74 లక్షల మంది ఉన్నారు.

కుటుంబాలపరంగా చూస్తే 54 లక్షలు ఉంటాయని అధికారుల అంచనా. వీరందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.9వేల చొప్పున రెండు విడతలుగా ఇస్తుంది. కేంద్రం ఇచ్చే రూ.6వేలు కూడా వీరికి అందుతుంది. మొత్తంగా చూస్తే ఒక్కో కుటుంబానికి రూ.15వేలు వస్తాయి. అయిదెకరాలపైన ఉన్న రైతులు 10.50 లక్షల మంది ఉండగా, కుటుంబాలపరంగా 8 లక్షల వరకు ఉంటాయి. కేంద్రం నుంచి వీరికి ఎలాంటి సాయం అందదు. రాష్ట్రమే కుటుంబానికి రూ.10వేల చొప్పున ఇస్తుంది.

మొత్తం మీద రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కుటుంబానికి కనీసం 10 వేలు దక్కుతాయి. అదే చిన్న కారు రైతులు అయితే 15 వేలు. మొన్నటివరకూ ఎకరాకి ఏడాదికి 8000 ఇచ్చిన తెరాస ప్రభుత్వం దానిని 10000 కు పెంచుతామని ఎన్నికల సందర్భంగా ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్ర సాయాన్ని తమ రైతు బంధు పథకానికి కేంద్ర నిధులు వాడుకోవాలని యోచిస్తుందట. ఆ ప్రకారం జరిగితే అన్నదాత సుఖీభవ స్కీం రైతు బంధు కంటే బెటర్ అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఇది ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.