Chandrababu -Naidu annadata-sukhibhava schemeఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొదట్లో జనవరిలోనే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తాం అని చెప్పారు. ఆ తరువాత అది ఫిబ్రవరి మధ్యకు మారింది. ఇప్పుడు తాజాగా మర్చి మొదటి వారం అంటున్నారు. ఈ తాత్సారానికి కారణం లేకపోలేదని తెలుగుదేశం పార్టీ వారు అంటున్నారు. వరుస సంక్షేమ పథకాల ప్రకటనతో టీడీపీకి అంతా పాజిటివ్ గా ఉన్న తరుణంలో అనూహ్యంగా ఆ పార్టీ నుండి వైకాపాకు వలసలు మొదలయ్యాయి.

పోయిన వారిలో చాలా వరకు సీటు రాని నాయకులే కాకపోతే ప్రజలకు మాత్రం పార్టీ బలహీనపడుతుంది అనే సంకేతాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలో అభ్యర్థులను ఖరారు చేస్తే అసంతృప్తులు వెళ్లిపోయే అవకాశం ఉంది. ఈ సారి ప్రభుత్వంపై ఓవర్ ఆల్ గా పాజిటివ్ గా ఉన్నా చాలా చోట్ల సిట్టింగు ఎమ్మెల్యేల పై వ్యతిరేకత ఉంది. వారిని మార్చడం ఖాయం. ఈ క్రమంలో ముందే అభ్యర్థులను ఖరారు చేస్తే వారంతా వెళ్ళిపోతారు. అలా అని వారిని మార్చకుండా ఉండలేరు. దీనితో చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా ఉంది.

అభ్యర్థులను ఖరారు చెయ్యడం కోసం ఇప్పటికే నాలుగు వేరు వేరు సంస్థల నుండి నాలుగు సర్వే రిపోర్టులు చంద్రబాబు తెప్పించుకున్నారు. వీటిని బట్టే అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి కొందరు మంత్రులకు కూడా సీటు దక్కకపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు. మరోవైపు మర్చి మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవుతుందని అంతా భావిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటన దానికి ముందు ఉంటుందా వెనకాల ఉంటుందా అనేది చూడాలి.