Chandrababu Naidu-TDP to Call for A Black Day Against the Central Governmentఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ స్పీడ్ పెంచారు. ఇప్పటికే అనేక తాయిలాలతో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఆయన సార్వత్రిక ఎన్నికలపై ఆయన ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. జిల్లాల వారిగా రిపోర్టులను తీసుకున్న ఆయన గెలుపు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకున్నారు. కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మాట్లాడి తుది జాబితా సిద్ధం చెయ్యబోతున్నారు. ఫిబ్రవరి చివరి లోగానే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని ఆయన పార్టీ నాయకులతో చెప్పారు.

వీలైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగానే చాలా వరకు అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈలోగా ప్రతి రోజు రెండు జిల్లాల్లో పర్యటించడం.. లేదా కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం… లేకపోతే బహిరంగ సభల ద్వారా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడం లాంటి అంశాలపై కసరత్తు చేస్తున్నారు. దీని కోసం రూట్ మ్యాప్ కూడా సిద్ధం చెయ్యమని పార్టీ నేతలతో చెప్పినట్టు సమాచారం. ఫిబ్రవరి 10వ తేది నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రాబోతుందన్నారు.

కోడ్ అమలు లోకి వచ్చే అవకాశం ఉండడంతో దాని కంటే ముందే కొన్ని పథకాల ప్రకటనలు, కొన్ని ప్రారంభోత్సవాలు జరపబోతున్నటు తెలుస్తుంది. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ కూడా ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించాలని చూస్తున్నారని వస్తున్న వార్తల పై చంద్రబాబు స్పందిస్తూ వారి కంటే ముందే తమ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చంద్రబాబు చెప్పారు. సహజంగా అభ్యర్థులను నామినేషన్ల చివరి రోజు వరకు నాన్చడం చంద్రబాబు శైలి. ఈసారి గతంలో కంటే భిన్నంగా చేస్తారేమో చూడాలి.