Chandrababu naidu super plans for investments in amaravatiరాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నవ్యాంధ్రప్రదేశ్… పెట్టుబడులు వెల్లువలా వస్తే తప్పించి సమీప భవిష్యత్తులో ఒడ్డున పడే అవకాశాలు కనిపించడం లేదు. మొన్నటిదాకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల పేరిట విదేశాల్లో కాళ్లరిగేలా తిరిగిన చంద్రబాబు… తాజాగా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న దేశాల్లో ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందన్న ఆయన ఆలోచనలో భాగంగా నిన్న బ్రిటన్ రాజధాని లండన్ లో ‘అమరావతి ఆఫీస్’ తలుపులు తెరచుకుంది.

ఇదే తరహాలో త్వరలోనే మరో ఆరు దేశాల్లో అమరావతి కార్యాలయాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఏపీఏడీబీ) సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్ తెలిపారు. లండన్ లో అమరావతి కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా అమరావతి కార్యాలయాలు ఏర్పాటు కానున్న నగరాలను ప్రకటించారు. వీటిలో సింగపూర్, జపాన్ రాజధాని టోక్యో, హాంకాంగ్ లేదా షాంగై, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, దుబాయి, అమెరికా నగరం లాస్ ఏంజెలిస్ నగరాలున్నాయి.