Chandrababu naidu strict on employeesనవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిని తానూ పూర్తిగా నిర్మించలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసారు. “తాను అడ్మినిస్ట్రేటివ్ కాపిటల్ ను మాత్రం సాధ్యమైనంత త్వరగా నిర్మిస్తానని, మౌలిక వసతులు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని… ఆపై పరిశ్రమలు తరలి రావడం, ప్రజల నుంచి అందే సహకారం, ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధిపై ఆధారపడి పూర్తి నగరం నిర్మితం అవుతుందని తెలిపారు చంద్రబాబు.

60 సంవత్సరాల పాటు హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకున్న తరువాత హేతుబద్ధత లేకుండా కట్టుబట్టలతో తరిమేశారని… రాజధాని లేకుండా, బస్సులో నుంచి పాలన సాగిస్తూ, ప్రజలకు మేలు చేయాలని తాను చూశానని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 వేల కోట్ల రుణమాఫీని తాను చేశానని, 4 కోట్ల మందికి ప్రతి నెలా సరిపడా బియ్యం ఇస్తున్నామని వివరించారు. నిత్యమూ కోతలు లేని కరెంటును ఇస్తున్నామని, గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి యావత్ భారత జాతికి ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు.

అమరావతికి ఉద్యోగుల తరలింపుపై స్పందించిన చంద్రబాబు… ఉద్యోగుల వైఖరిని ఖండిస్తూ… “నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఇంకా ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు. ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే, నేను చాలా గట్టిగా ఉంటాను. క్రమశిక్షణా రాహిత్యం అవుతుంది. మీకేదైనా ఉంటే మీ హెడ్డాఫీసర్ తో మాట్లాడండి. టైమ్ షెడ్యూల్ వాళ్లు ఇస్తారు. ఓవరాల్ గా ఎవరెవరు రావాలి, ఎప్పుడు రావాలి, ఎక్కడ బస, తదితర అన్నీ వాళ్లు చెబుతారు తప్ప, మీరు అనవసరంగా ప్రెస్ కు వెళ్లి మాట్లాడితే మాత్రం వెరీ సీరియస్ గా తీసుకుంటాం. నా మంచితనాన్ని మీరు దుర్వినియోగం చేసుకుంటే మాత్రం మంచిది కాదు” హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యలు చేసారు.

రాజకీయ నాయకుల దగ్గరికి పోవడం, పార్టీల దగ్గరికి పోవడం… ఏంటి, ఆటలుగా ఉందా? అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే, నేను ఒకప్పుడు చాలా కఠినంగా ఉండేవాడిని. ఇప్పుడు అందరినీ కలుపుకుపోవాలన్న ఉద్దేశంతో 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చాను. టెక్నాలజీని వినియోగించుకోవాలని, ఎవరికైనా వ్యక్తిగత ఇబ్బందులు ఉంటే తన వద్దకు తీసుకు రావాలని సూచించారు. కొత్త నగరంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, అంతమాత్రాన ఉద్యోగులు ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని స్పష్టం సంకేతాలు ఇచ్చారు.

తాను ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంతో అభివృద్ధి చేశానని, ఆపై 2004లో ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు పొలాలపై పడే అడవి పందుల్లా మేసినంత మేసి, మిగతాది నాశనం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని నిప్పులు చెరిగారు. ఎక్కడో ఉండాల్సిన రాష్ట్రం, అభివృద్ధిలో ఇప్పుడు తిరిగి మొదటి మెట్టుపై ఉందని, పదేళ్ల కాంగ్రెస్ పాలనలో సర్వనాశనం తప్ప మరేమీ లేదని, ముక్కలైన రాష్ట్రంలో ఓ భాగాన్ని తానిప్పుడు తిరిగి గాడిలో పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పుడు పాలనలో కంటిన్యుటీ ఉంటే తప్ప దూసుకెళ్లలేమని ప్రజలకు తాను స్పష్టం చేస్తున్నానని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

దశాబ్దాలుగా తెలుగు జాతి అభివృద్ధికి పాటుపడుతున్న తనను, దేశమంతా గౌరవిస్తుంటే, ఇక్కడ మాత్రం నేరస్తులు, చోటా రాజకీయ నాయకులతో వ్యక్తిగత విమర్శలకు గురికావడం, వారితో తిట్టించుకోవడం తనకు బాధను కలిగిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలు వైకాపా నేతల వైఖరిని, ఆ పార్టీ నాయకుడు జగన్ చేస్తున్న బూటకపు ప్రచారాన్ని గమనిస్తున్నారని, వారే జగన్ కు బుద్ధి చెబుతారని, తనను విమర్శించే నైతిక హక్కు జగన్ కు లేదని విమర్శల వర్షం కురిపించారు.

ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు రాజకీయ ముసుగులో తప్పించుకోవాలని చూస్తే, అది తాత్కాలికమే అవుతుందని, వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదని… తనను విమర్శించే ముందు వారు చేసిన నేరాలను, వారిపై ఉన్న కేసులను గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. ప్రజల సంక్షేమం కోసం సలహాలు ఇవ్వాల్సిన బాధ్యతను ఏపీలో విపక్షం విస్మరించిందని విమర్శించిన చంద్రబాబు, ఆ పార్టీని ప్రజలు చీదరించుకుంటున్నారని వైసీపీని ఎండగట్టారు.