Chandrababu naidu riding bullet bikeచంద్రబాబు నాయుడు అంటే నమ్మిన వారిని పట్టించుకోరన్న ప్రచారం. ఎంతటివారినయినా వాడుకుని అవసరం తీరిన తర్వాత వదిలేస్తారన్న విమర్శ. అవసరం లేకపోతే పలకరించని ఆరోపణ. విశ్వసనీయత లేని నాయకుడని ఆక్షేపణ. విపక్షం, స్వపక్షంలోనూ తరచూ వినిపించే ఈ వ్యాఖ్యలకు బాబు తన నిర్ణయాల ద్వారా ఎట్టకేలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. కష్టపడి పనిచేసిన వారిని తాజాగా పదవులతో పల్లకి ఎక్కించారు.

అధికారంలోకి వచ్చిన 16 నెలల తర్వాత భారీ స్థాయిలో చేపట్టిన పదవుల పంపిణీతో చంద్రబాబునాయుడు తనపై సుదీర్ఘకాలంగా ఉన్న ‘విశ్వసనీయత లేని నేత’ అనే అపవాదును తొలగించుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉండగా వెంట నిలిచిన వారిని కార్పొరేషన్ చైర్మన్ పదవులతో గుర్తింపునిచ్చారు. నమ్మిన వారిని నట్టేట ముంచుతారని, దేశంలో విశ్వసనీయతలేని ఏకైక నాయకుడు ఆయనేనంటూ.. దివంగ‌త వైఎస్ నుంచి జగన్ వరకూ అనేకసార్లు బాబుపై విమర్శనాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే.

వైఎస్ సీఎంగా ఉండగా, ఆపరేషన్ ఆకర్ష్‌ ప్రారంభించారు. ఆ సందర్భంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడిన వైఎస్ ‘మీ నాయకుడికి విశ్వసనీయత లేదు. అతడిని నమ్ముకుంటే మీకు ఏమీ రాదు. మిమ్మల్ని వాడుకుని వదిలేసే రకం. అతను ఈ జీవితంలో సీఎం కాలేడు. మీరు కాంగ్రెస్‌లో చేరండి. మీకు నేనున్న. నేను చంద్రబాబు లాంటి వాడిని కాదు’ అని తరచూ బహిరంగంగానే వ్యాఖ్యానించేవారు. దానితోపాటు, పార్టీని వీడిన చాలామంది సీనియర్లు సైతం.. నమ్మినవారిని నట్టేటముంచడం, అవసరం తీరిన తర్వాత వదిలేయడం బాబు నైజమని నిందించిన సందర్భాలు కోకొల్లలు.

విభ‌జ‌నాంత‌ర ఏపీలో అధికారంలోకి వచ్చి 16 నెలలయినప్పటికీ నామినేటెడ్ పదవులు పంపిణీ చేయకపోవడం కూడా ఆ విమర్శలకు కొంత బలం చేకూర్చినట్టయింది. తాజాగా ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ల జాబితా బాబుపై ఇప్పటివరకూ ఉన్న నిందారోపణలు తుడిచిపెట్టినయింది. తాజా జాబితాలో చోటు చేసుకున్న వారి పేర్లు పరిశీలిస్తే, బాబు తనపై నమ్మకం పెంచుకునే ప్రయత్నాలు ప్రారభించారని స్పష్టమవుతోంది. పార్టీ కష్టకాలంలో ఉండగా, అధికారపక్షంపై విరుచుకుపడిన వారికి పదవులతో గుర్తింపునివ్వడం ద్వారా, నమ్మినవారిని పట్టించుకోరన్న అపవాదును తొలగించుకున్నారు. జూపూడి మినహా మిగిలిన వారంతా పార్టీ కష్టకాలంలో దన్నుగా ఉన్నవారే. ఎన్నికల ముందు, తర్వాత రోజా, జగన్‌పై ఒంటికాలిపై విరుచుకుపడిన వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాంకేతిక కారణాలతో పదవి రాకుండా పోయిన జూపూడికి కార్పొరేషన్ ఇచ్చి అన్నమాట నిలబెట్టుకున్నారు. దానితోపాటు, ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా జగన్ పార్టీ నుంచి వచ్చే వారికి తగిన గౌరవం ఉంటుందన్న సంకేతాలిచ్చారు.

అదే విధంగా గత ఎన్నికల్లో టికెట్ కోల్పొయిన మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం ద్వారా విశ్వసనీయత లేని నాయకుడన్న ముద్రను బాబు తొలగించుకున్నారు. సుదీర్ఘకాలం నుంచీ పార్టీ ఆఫీసులో పనిచేస్తున్న తన సన్నిహితుడయిన ప్రొఫెసర్ జయరామిరెడ్డికి కీలకమైన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కట్టబెట్టారు. రెండున్నర దశాబ్దాల నుంచి పార్టీలో మీడియా వ్యవహారాలు చూస్తున్న ఎల్వీఎస్ఆర్‌కే ప్రసాద్‌కు కూడా ఆలస్యంగానయినా కార్పొరేషన్ చైర్మన్ పదవితో న్యాయం జరిగింది. తెలంగాణకు చెందిన ప్రసాద్‌కు వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ వంటి కీలక విభాగం ఇవ్వడం ద్వారా, తెలంగాణకు సైతం న్యాయం చేశానన్న సంకేతాలివ్వగలిగారు.

మ‌రోవైపు గ‌తంలో ఇచ్చిన నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలోనూ బాబు ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు. చంద్ర‌బాబు ప్రతిపక్షంలో ఉండగా ప్రాణాలకు ఒడ్డి నిర్వహించిన మీ కోసం, పాదయాత్రలతో బాబుకు వెన్నంటి ఉండి, నెలలపాటు కుటుంబానికి కూడా దూరంగా ఉంటూ స్వయంగా పర్యవేక్షించిన గరికపాటి మోహన్‌రావుకు రాజ్యసభ ఇచ్చారు. మళ్లీ తాజాగా జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడిగానూ నియమించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటినుంచి మొన్నటి వరకూ జగన్‌పై ఒంటికాలిపై విరుచుకుపడిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు ఎన్నిక‌ల్లో ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీ పదవులిచ్చి తనపై నమ్మ కం పెంచుకున్నారు. నెల్లూరు జిల్లా నేత బీద రవిచంద్రకు జిల్లా అధ్యక్ష పదవి, ఎమ్మెల్సీ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్ననాటి నుంచి పార్టీ ఆఫీసు సమన్వయకర్తగా ఉంటూ పనిచేసిన సీనియర్ నేత టీడీ జనార్దన్‌రావుకు ఇటీవలే ఎమ్మెల్సీ ఇచ్చారు.

ఇక కార్యక్రమాల కమిటీని ఎంతో ఓపికతో నిర్వ‌హించి వాటిని భుజాన వేసుకుని పర్యవేక్షిస్తున్న చౌదరికి కూడా ఎమ్మెల్సీ దక్కింది. ఎన్టీఆర్ కాలం నుంచి పార్టీ ఆఫీసును అంటిబెట్టుకున్న ఏవీ రమణకు ఏపీ పార్టీ ఆఫీసు బాధ్యతతోపాటు, టీటీడీ సభ్యుడిగానూ అవకాశం ఇచ్చారు. ఒక మామూలు కార్యకర్తకు రెండు పదవులిచ్చిన బాబు తన ఎంపిక సరైనదేనని చాటుకున్నారు. ఆ ప్రకారంగా తనను, పార్టీ ఆఫీసును నమ్ముకుని పనిచేసిన వారికి బాబు న్యాయం చేశారు. మొత్తంగా తాజా నియామకాలతో అటు క్యాడర్‌లోనూ కొత్త ఉత్సాహం నింపింది. ఇదిలా ఉండ‌గా…త్వరలో మరికొన్ని కార్పొరేషన్ల నియామకాలకు రంగం సిద్ధం చేస్తున్నారని స‌మాచారం.