chandrababu naidu speech in mini mahanadu at chodavaramఒంగోలులో మహానాడు విజయవంతంగా నిర్వహిస్తున్నప్పుడే ప్రతీ జిల్లాలో కూడా మినీ మహానాడు నిర్వహిస్తామని, దానికి తాను స్వయంగా హాజరవుతానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చెప్పినట్లుగానే నేను అనకాపల్లి జిల్లా చోడవరంలో మినీ మహానాడులో పాల్గొని ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు టిడిపి శ్రేణులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “చోడవరం నుంచే వైసీపీ పతనం ప్రారంభం అయ్యింది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటూ విశాఖ ప్రజలకు మాయమాటలు చెపుతూ మూడేళ్ళు కాలక్షేపం చేశారు జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి. అయితే రాష్ట్రంలో రోడ్ల గుంతలు కూడా పూడ్చలేకపోతున్న జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు కడతామని చెప్పుకొంటూ ప్రజలను మోసం చేశారు. రాజధాని లేకపోవడం వలన రాష్ట్రానికి ఒక్క కంపెనీ రాలేదు. ఒక్క ఉద్యోగం రాలేదు. వీరిరువురూ రాజ్యం ఏలుతున్నంత వరకు రాష్ట్రానికి పరిశ్రమలు రావు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు.

జగన్, విజయసాయి కలిసి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నాశనం చేసేస్తున్నారు. విద్యా వ్యవస్థకు పదో తరగతి ఫలితాలు అద్దం పట్టాయి. ఎపుడూ పచ్చగా మూడు పంటలతో కళకళలాడే కోనసీమలో క్రాప్ హాలీడే వ్యవసాయ రంగం అస్తవ్యస్తం అవుతోందని సూచిస్తోంది. ప్రభుత్వ పనితీరును మేము ప్రశ్నిస్తుంటే జవాబులు చెప్పలేక మాపై ఎదురుదాడికి దిగుతున్నారు.

అన్ని ఛార్జీలు పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతుంటే నేను చూస్తూ ఊరుకోను. ప్రభుత్వం దిగివచ్చేవరకు పోరాడుతూనే ఉంటాను. కనుక మిగిలిన ఈ రెండేళ్ళలోనైనా జగన్ తన వైఖరిని మార్చుకొని ప్రజా సమస్యలను పరిష్కరించాలని నేను డిమాండ్ చేస్తున్నాను,” అని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

అమరావతిని రాజధానిగా చేస్తే అక్కడ టిడిపి నేతలు, కమ్మసామాజిక వర్గానికి లబ్ధి కలుగుతుందనే ఆలోచనతో అమరావతిని పక్కన పెట్టేయడం వలన చుట్టుపక్కల జిల్లాల ప్రజలందరూ నష్టపోయారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడంతో కర్నూలు, విశాఖ నగరాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు భారీగా పెట్టుబడులు పెట్టి నిర్మాణాలు చేపట్టారు. కానీ ఇప్పుడు మూడు రాజధానులు అటకెక్కిపోవడం వారూ తీవ్రంగా నష్టపోయారు.

ఇంత జరిగినా వైసీపీ ప్రభుత్వం నేటికీ అమరావతిని రాజధానిగా అంగీకరించడం లేదు. కనుక రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోతోంది. ప్రభుత్వమే మా రాష్ట్ర రాజధాని ఇదీ… అని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నప్పుడు ఇక ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు ఏవిదంగా వస్తాయి?

ఏపీలో ఇటువంటి అనిశ్చిత రాజకీయ వాతావరణం ఉన్నందునే పరిశ్రమలు, పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి క్యూకట్టి వెళ్ళిపోతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణగా ఎలెస్ట్ కంపెనీ దుండిగల్‌లో రూ.24,000 కోట్ల భారీ పెట్టుబడితో ఎమోలెడ్ స్క్రీన్స్ తయారుచేసే పరిశ్రమను ఏర్పాటు చేస్తుండటం చెప్పుకోవచ్చు. పొరుగు రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నా మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎందుకు రావడం లేదని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తోందో లేదో?