Chandrababu Naidu Speech at leadership empowerment programme టీడీపీ నాయకత్వ సాధికారత వర్క్ షాప్ లో ప్రసంగించిన పార్టీ అధ్యక్షుడు నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పులు చేసినా ప్రజలు పట్టించుకోరని, అదే, అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేస్తే ప్రజలు ఊరుకోరని దిశానిర్దేశం చేసారు. అధికార పార్టీల ఎమ్మెల్యేలపై ప్రజల అంచనాలు ఎక్కువగా ఉంటాయని, ఆశించిన మేరకు సేవలు అందకపోతే ప్రజలు సహించరని అన్నారు.

ప్రజాప్రతినిధుల పనితీరుపై 3 నెలలకు ఒకసారి సర్వే జరిపిస్తున్నామని, ఆ సర్వే వివరాలు అందజేస్తున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజల్లో 80 శాతం సంతృప్తి రావాలని, రాజకీయ ఏకీకరణ 80 శాతం జరగాలని సూచించారు. సంక్షేమ పథకాలపై ఉన్న అనుకూలతను మన పార్టీ సద్వినియోగం చేసుకోవాలని, నేతల మధ్య విభేదాలను తాను సహించనని చంద్రబాబు హెచ్చరించారు.

పార్ట్ టైం పాలిటిక్స్ కు కాలం చెల్లిందని, నిరంతరం ప్రజల్లో ఉండాలని, మీ పనుల్లో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండకుండా చూసుకోవాలని, గత ఎన్నికల్లో మనకు మద్దతు ఇవ్వని వర్గాలు కూడా ప్రస్తుతం మన సంక్షేమ కార్యక్రమాలతో చేరువవుతున్నాయని అన్నారు. గత రెండున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని నేతలకు సూచనలు చేసారు.

‘మీ ఇగో మీతోనే పోదు… పార్టీకి కూడా అంటుకుంటుంది. మనల్ని మనమే ఇరుకున పెట్టుకునేలా వ్యవహరించవద్దు’ అని పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ప్రభుత్వంపై పట్టు సాధించాం, పరుగులు తీయిస్తున్నాం, నియోజకవర్గాలపై మీ పట్టు సడలనివ్వకండి, ఎమ్మెల్యేల పనితీరుపై మూడు నెలలకొకసారి ఇచ్చే నివేదికను చూసుకుని లోపాలను సవరించుకోవాలి. మన ఎమ్మెల్యేలందరూ వచ్చే ఎన్నికల్లో గెలవాలనేదే నా లక్ష్యమంటూ ఉత్తేజపరిచారు.

ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని, ఈ విషయమై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీలోకి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలతో సమన్వయంతో ఉండాలని సూచించారు. వైఎస్ హయాంలో దోచుకున్న విధంగా దోచుకోవాలని కొంతమంది పార్టీ కార్యకర్తలు ఆలోచిస్తున్నారని, అది కరెక్ట్ కాదని అన్నారు. పార్టీ కోసం తమ ఆస్తులు త్యాగం చేసి, కష్టపడిన వారిని ఆదుకుంటామని, ఆర్ధికంగా వెనుకబాటుతనంగా ఉన్న వారికి పార్టీ న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.