Chandrababu naidu slapped Pocahram Srinivas Reddyతెలంగాణా అసెంబ్లీ సమావేశాలు వేడెక్కాయి. తెలంగాణా వ్యవసాయ మంత్రి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను కొట్టారంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్నే లేపాయి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ‘నిజాం షుగర్స్’ ప్రైవేటీకరణపై జరిగిన చర్చలో… ప్రైవేటీకరణను వద్దని తాను ప్రతిపాదించానని, అయితే అసహనానికి గురైన చంద్రబాబు తనపై మండిపడ్డారని, అంతటితో ఆగకుండా తనపై చేయి కూడా చేసుకున్నారని పోచారం చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అసెంబ్లీ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఈ విషయాన్ని తాను ఏనాడు బయట పెట్టలేదని పేర్కొన్న పోచారం… తొలిసారిగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నానని, ప్రైవేటీకరణ వద్దని చేతులు జోడించి వేడుకుంటే చంద్రబాబు వద్ద తనకు జరిగిన సత్కారం దెబ్బలేనని సంచలన ప్రకటనలకు తెరలేపారు.

అయితే ఈ వ్యాఖ్యలపై తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రులు కొడతారన్న విషయం తనకు ఇప్పటివరకు తెలియదని, అప్పుడు చంద్రబాబు గారు కొట్టారో లేదో తనకు తెలియదని, అయితే పోచారం అప్పుడెప్పుడో సిఎం కొట్టిన విషయాన్ని ఇప్పుడు చెబుతున్నారని, మరి ఇప్పుడు సిఎం కొట్టిన దెబ్బలను ఎప్పటికీ చెప్తారో అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.

ఆ తర్వాత మైక్ అందుకున్న జీవన్ రెడ్డి… చంద్రబాబు చేతిలో దెబ్బలు తిని కూడా తెలుగుదేశం పార్టీలోనే ఎలా కొనసాగారని, తన అభిప్రాయాలతో విభేదించినపుడు రాజీనామా అనేది రాజకీయ నాయకుడి హక్కు అని, మరి మంత్రి గారు అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదని… పోచారం చేసిన సంచలన ఆరోపణలను ఏకరువు పెట్టే ప్రయత్నం చేసారు. ఈ ఆరోపణలు – ప్రత్యారోపణలతో తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లడంతో, సభను స్పీకర్ కొద్ది సేపు వాయిదా వేశారు.