Chandrababu Naidu Slams BJP, Chandrababu Naidu Slams Arun Jaitley, Chandrababu Naidu Slams Narendra Modi, Chandrababu Naidu Slams Ally BJP, TDP BJP Break Upరోజులు గడుస్తున్న కొద్దీ కేంద్రం నుండి అందాల్సిన సహకారం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్న వాదన బలాన్ని పుంజుకుంటోంది. గతేడాది ప్రతిష్టాత్మక గోదావరి పుష్కరాలకు 100 కోట్లు ఇచ్చి ఎంతో కొంత సాయం చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరి, ఈ ఏడాది కృష్ణా పుష్కరాలకు మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అలా ఏపీపై ‘చిన్న చూపులు’ చూస్తున్నా… ప్రభుత్వంలో భాగస్వామి అయి కూడా సరిపెట్టుకుపోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా రాజ్యసభలో కేవీపీ బిల్లుపై జరిగిన చర్చ పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా రెండు జాతీయ పార్టీలను కడిగి పారేసారు.

‘ఫ్రెండ్లీ పార్టీ అయినంత మాత్రాన సహాయం చేయమని’ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అన్న వ్యాఖ్యలను ఉదహరిస్తూ బిజెపిపై మునుపెన్నడూ లేని స్థాయిలో విరుచుకుపడ్డారు. “విభజన సమయంలో ఆదాయం, ఆస్తులు, అప్పులు, వనరులు ఇలా ప్రతి దాంట్లోనూ ఏపీకి అన్యాయం చేశారు. అవన్నీ చూసే అన్యాయం చేశారా? ఇది సరికాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇవన్నీ చూస్తుంటే పార్లమెంటు, రాజ్యాంగంపై నమ్మకం ఉంటుందా? మీ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తారా? విభజన జరిగిన నాటి నుంచి ఈ రోజు వరకు లెక్కలు తీయండి. అన్యాయం ఎవరికి? ఎంత జరిగిందో తెలుస్తుంది. నిధులు లేవు, అప్పులు చేస్తున్నాం, దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది అంటున్నప్పుడు ఆ రోజు విభజనకు ఎందుకు అంగీకరించారు? అంటూ బిజెపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఏపీ సమస్యలు పరిష్కరించడానికి సీతారాం ఏచూరి చెప్పినట్లుగా ఒక కమిటీ ఏర్పాటు చేయండి. అలా ఎందుకు చేయకూడదు? మేము కష్టపడతాము… మీరేం చేస్తారు? భూములిచ్చినా ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ వర్సిటీ ఇంకా ఎందుకు రాలేదు? ఒక యూనివర్సిటీలో స్టాండర్డ్స్ నెలకొల్పాలంటే పదేళ్లు పడతాయి. ఈ పదేళ్లు వాటి నిర్వహణ ఎలా? పోలవరం ఎన్నేళ్లలో పూర్తి చేస్తారో చెప్పారా? రెండేళ్లు అని మేము చెప్పాము… మీ సహకారం ఇలా ఉంటే అది పూర్తవుతుందా? కంపెనీలు ఎవరు తెస్తారు? ఇలాంటి కీలకమైన నిర్ణయాలు నిర్లక్ష్యంగా చర్చిస్తారా? ఈ విధానం మంచిది కాదని కేంద్రానికి సూచిస్తున్నానని గత రెండు సంవత్సరాలుగా బిజెపిపై ఉన్న ఆగ్రహాన్ని బయటపెట్టారు చంద్రబాబు.

జరిగిన అన్యాయం ఒక ఎత్తైతే… రాజ్యసభలో కాంగ్రెస్ నేతల ప్రవర్తన మరింత దుర్మార్గంగా ఉందని కాంగ్రెస్ పార్టీ తీరును కూడా ఏకరువు పెట్టారు. బిల్లు సందర్భంగా అందరూ హాజరు కావాలని విప్ జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ, కేవలం రెండు గంటల చర్చకు ఎందుకు అంగీకరించారు? దేశంలోని అన్ని పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సమంజసమే అన్నప్పుడు… ఎందుకు ఇవ్వలేదు? అని అడగాల్సిన బాధ్యత మీకు ఉందా? లేదా? బాధ్యత ఉన్నప్పుడు అరుణ్ జైట్లీ సమాధానం పూర్తి కాగానే ఎందుకు బాయ్ కాట్ చేశారు? బిల్లులో పెట్టిన ఫలానా అంశాలు లేవు అని ఆర్థిక మంత్రిని నిలదీయాలా? లేదా? ఎవరిని మభ్య పెట్టడానికి ఈ కపట నాటకాలు? అంటూ రాజ్యసభలో కాంగ్రెస్ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు.

కాంగ్రెస్ పార్టీ అన్నీ తెలిసి, రాష్ట్రానికి అన్యాయం చేసి, ప్రజలను అవమానించింది. ఈ అన్యాయాన్ని సరిచేయమని గత రెండేళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నాను. విభజన చట్టంలో ఏం పెట్టారు? ఏమిచ్చారు? ఏమివ్వాలి? అని ఎందుకు కాంగ్రెస్ పార్టీ అడగలేదు. 14వ ఆర్థిక సంఘానికి, విభజనకి సంబంధం ఏంటి? 14వ ఆర్థిక సంఘం ఏపీలో ఆర్థిక లోటు ఉంటుందని చెప్పింది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పినట్టు ఏపీకి మాత్రమే నిధులివ్వలేదు. ఆర్థిక లోటు పూరించేందుకు అన్ని రాష్ట్రాలకు నిధులు ఇచ్చారు. అందులో భాగంగానే ఏపీకి ఇచ్చారు తప్ప, కేవలం ఏపీకి మాత్రమే ఇవ్వలేదని పూర్తి స్పష్టత ఇచ్చారు.

రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తూ రెండు పార్టీలు చేస్తున్న రాజకీయాల పట్ల బహుశా చంద్రబాబు విసిపోయినట్లుగా కనపడుతున్నారు. ఓ పక్కన రాష్ట్రాన్ని ఒడ్డున పడేయడానికి అహర్నిశలు తానూ కష్టపడుతుంటే… కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపిస్తుండగా, స్వార్ధ రాజకీయాల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నాటకాలకు తెరలేపడం బాబు ఆగ్రహానికి కారణంగా తెలియవస్తోంది. ఆ క్రమంలోనే గత రెండేళ్లుగా ప్రదర్శిస్తూ వస్తున్న సహనాన్ని పక్కనపెట్టి, తొలిసారిగా గంభీర స్వరం వినిపించారు.