ys-jagan-pattiseema-controversy‘పట్టిసీమ’ ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తూ వస్తున్న వైసీపీ అధినేత జగన్ కు ఇప్పటివరకు నీతిసూక్తులు చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తొలిసారిగా ఓ రేంజ్ లో వ్యంగాస్త్రాలు సంధించి అసెంబ్లీ అంతా నవ్వులు పూయించారు. చంద్రబాబు చేసిన వాగ్దాటికి అధికార పార్టీ వర్గీయులే కాదు, ఏకంగా జగన్ కూడా నవ్వుతూ ఉండడం మరో విశేషం. ఆ తర్వాత జగన్ ‘నవ్వు’ మీద కూడా మరో ‘కామెంట్’ చేసి నిండు సభలో జగన్ ను ఏకరువు పెట్టారు.

పోలవరం కుడి కాలువ పనులు వైయస్ హయంలోనే జరిగాయని, పట్టిసీమ వలన రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని, పట్టిసీమ నుండి కృష్ణాడెల్టాకు నీరందించిన మాటల్లో నిజం లేదని, చంద్రబాబు చెవిలో పూలు పెడుతున్నారని… జగన్ మండిపడుతున్న సమయంలో పైకి లేచిన చంద్రబాబు అసెంబ్లీ వాతావరణాన్ని అంతా మార్చేసారు. గతంలో జనార్ధన్ రెడ్డి చేసిన వితండవాదాలతో మొదలు పెట్టిన చంద్రబాబు… ‘పట్టిసీమ’ రావడానికి వీలు లేదు, రాయలసీమకు నీళ్ళు రావడానికి వీలు లేదు అనే విధంగా జగన్ పోకడ ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇంత మంచి ప్రాజెక్ట్ కు అడ్డం పడతారని తన జీవితంలో ఊహించలేదని, ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిన తర్వాత కూడా అడ్డం పడిపోతున్నారని అన్న బాబు సభలోని వైసీపీ సభ్యుల పేర్లను పిలిస్తూ ప్రతి ఊరికి నీళ్ళు వస్తాయని… జగన్ అడ్డం పడ్డా… అడ్డుగా పోడుకున్నా… పులివెందులకు కూడా నీళ్ళు తెప్పించే బాధ్యత తనదని… ప్రతి ఊరికి పోయి… జగన్ అడ్డం పడ్డారని, వైసీపీ నేతలు అడ్డు పడినా నీళ్ళు తెప్పించానని ప్రజలకు చెప్తానని, ప్రజాజీవితాన్ని సిల్లీగా తీసుకోవద్దని హెచ్చరికలు జారీ చేసారు.

మీరు చెవిలో పూలు పెట్టుకున్నా… లేకున్నా… ప్రజలు మీ చెవిలో పూలు పెట్టే రోజులు వస్తాయని… ఆ విషయం గుర్తు పెట్టుకోవాలని… వ్యవసాయం చేయని నీకు తడి అంటే తెలియదని, నువ్వు వేరే వ్యాపారాలు చేసావని, నేను మాట్లాడింది ‘రెయిన్ గన్’ అని మాట్లాడితే దానిని కూడా గన్నులతో పంటలను చంపుతాడని ప్రచారం చేస్తారని, జగన్ మోహన్ రెడ్డి నీకు దండం పెట్టి చెబుతున్నా… అర్ధం చేసుకో… నువ్వు ఎవరు చెప్పినా వినవని నీపైన ఒక అపవాదు కూడా ఉంది… కొన్ని రంగాల్లో రాణించాలంటే నాణ్యత చాలా ముఖ్యం అన్న చంద్రబాబు… జగన్ మాటలతో తనకు మతి పోయిందని, ఎందుకు పట్టిసీమను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకైనా తెలుసా… అంటూ వైసీపీ సభ్యులకేసి చూపుతూ… ‘ఏమయ్యా… మీకైనా తెలుసా…’ అంటూ చంద్రబాబు పలికించిన హావభావాలు ఫుల్ ‘ఎంటర్టైన్మెంట్’ను పంచాయి.

రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళందరికి పాఠాలు చెప్పాలని, మళ్ళీ బడికి పంపించాల్సిందేనని నవ్వించిన చంద్రబాబు… ప్రతిపక్షం నుండి ఏమైనా సూచనలు చేస్తే వినడానికి తానూ ముందు ఉంటానని అన్నారు. తదుపరి మళ్ళీ లేచిన సిఎం… జగన్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు… ఎందుకో నాకు అర్ధం కాదు… ఆశ్చర్యం వేస్తోంది… మామూలుగా అయితే ఒక వ్యక్తి ఎప్పుడు నవ్వుతాడంటే… నవ్వడం అలవాటైపోయి నవ్వుతాడు… లేకపోతే వెకిలి నవ్వులు నవ్వుతాడు… అది కాదంటే ఏమీ తెలియనప్పుడు నవ్వుతాడు. మరి జగన్ ఎందుకు నవ్వుతున్నారో ఆయనకైనా తెలుసో లేదో అంటూ చురకలంటించారు. “రాయలసీమలో ఉండేవారు గోదావరి చూసి ఉండరు. మీరందరూ గోదావరి పుష్కరాలకు వెళితే పుణ్యం అన్నా వచ్చేది. అది కూడా మీరు చేయలేదు” అంటూ చంద్రబాబు నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు జగన్ వర్గీయులను ఎక్కడో తాకి ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు.

ఇదిలా ఉంటే… ‘పట్టిసీమ’ను జగన్ వ్యతిరేకించవద్దని వైసీపీలో ఉన్న సమయంలోనే ఆదినారాయణరెడ్డి మీడియా ముఖంగానే వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. ‘ప్రజలు ఆమోదం పొందిన అంశంపై వ్యతిరేక పోరాటం చేస్తే… రాజకీయంగా తప్పటడుగు వేసినట్లే అవుతుందని’ ఆదినారాయణరెడ్డి సూచనలు చేసినప్పటికీ… జగన్ వినకపోవడం అనేది… సభలో చంద్రబాబు చేసిన ‘జగన్… నువ్వు ఎవ్వరి మాట వినవంటగా’ అన్న దానిని మరొకసారి జ్ఞప్తికి తెస్తుంది. ఆన్ ది రికార్డ్ ఆదినారాయణరెడ్డి మాత్రమే చెప్పినప్పటికీ ఆఫ్ ది రికార్డ్ లో చాలా మంది వైసీపీ నేతల అభిప్రాయం కూడా ఇదేనని… అందుకే అసెంబ్లీలో ప్రత్యేకించి ఒక్కొక్క వైసీపీ నేత పేరు చంద్రబాబు ప్రస్తావించారని… రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.