High Court Gives Favourable Ruling to Naidu in Security Caseతన భద్రత కుదించడాన్ని సవాల్‌ చేస్తూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై హైకోర్టులో ఇటీవలే వాదనలు ముగిశాయి. ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు తీర్పును రిజర్వు చేశారు. తాజాగా ఆ కేసుపై తుది తీర్పును కాసేపటి క్రితం వెల్లడించారు. ఇందులో ప్రతిపక్ష నాయకుడికి అనుకూలంగా హై కోర్టు తీర్పు ఇచ్చినట్టు అయ్యింది.

ఆయనకు మొత్తం 97 మంది భద్రతా సిబ్బందిని కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్లోజ్‌డ్‌ సెక్యూరిటీ ఎవరి పని అనే అంశంపై ఎన్‌ఎస్‌జీ, స్టేట్‌ సెక్యూరిటీ మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలపై మూడు నెలల్లో ఓ నిర్ణయానికి రావాలని నిర్దేశించింది. అలాగే, చంద్రబాబు కాన్వాయ్‌లో జామర్ వాహన సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. చంద్రబాబుకు చీఫ్ సెక్రటరి ఆఫీసర్ ను ప్రభుత్వం నియమించవచ్చని హైకోర్టు తెలిపింది.

చంద్రబాబుకు ఉండే ఇద్దరు ప్రధాన భద్రతా అధికారులను తొలగించటంతో పాటు వీరికి అనుబంధంగా ఉండే ముగ్గురు ఆర్‌.ఐల నేతృత్వంలోని దాదాపు 15 మంది సిబ్బందిని పూర్తిగా తప్పించారు. 2003లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మావోయిస్టులు మందుపాతర పేల్చి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన నుండి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆ తరువాత ఆయన 2004 నుండి 2014 వరకు ప్రతిపక్షంలో ఉన్నా అప్పటి ప్రభుత్వాలు భద్రత విషయంలో అలసత్వం ప్రదర్శించలేదు.

ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ, ముగ్గురు ఆర్‌ఐ బృందాలతో చంద్రబాబుకు భద్రత కల్పిస్తూ వచ్చాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అందరినీ తొలగించి ఇద్దరేసి కానిస్టేబుళ్లు చొప్పున రెండు బృందాలుగా 2+2గా మాత్రమే కేటాయించింది. కోర్టు తాజా తీర్పుతో టీడీపీ నేతలు, క్యాడర్ ఊపిరి పీల్చుకున్నాయి.