Chandrababu Naidu Mentions Early Election Again - What's Cookingసార్వత్రిక ఎన్నికలకు ‘కౌంట్ డౌన్’ మొదలైందన్న సంకేతాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చేసారు. 2019లో జరగాల్సిన ఎన్నికల గురించి పార్టీ నేతలకు తగు సూచనలు చేసారు సిఎం. అమరావతిలో జరిగిన టిడిపి వర్క్ షాప్ లో మాట్లాడిన చంద్రబాబు… సార్వత్రిక ఎన్నికలు 2018 డిసెంబర్ లో గానీ, 2019 ప్రధమార్ధంలో గానీ జరిగే అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా సమాయత్తం అయ్యుండాలని టీడీపీ శ్రేణులను హెచ్చరించారు.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది కదా అని అలసత్వం ప్రదర్శించవద్దని, నంద్యాల ఉప ఎన్నికలలో 56 శాతం వచ్చిన ఓటింగ్ ను 60 శాతానికి ఎలా పెంచుకోవాలి అనే దిశగా ఆలోచనలు చేయాలని, నంద్యాల, కాకినాడ ఎన్నికలలో సాధించిన విజయాలను చూసి పొంగిపోవద్దని, మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శించవద్దని నేతలకు సూచనలు చేసారు. నాయకుడికి ప్రతి ఎన్నిక ఒక పాఠం లాంటిదని, అందులో లోటుపాటులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

టిడిపి నేతలకు చేసిన దిశానిర్దేశాల సంగతి పక్కన పెడితే, వచ్చే ఏడాది డిసెంబర్ లోనే సార్వత్రిక ఎన్నికలు వస్తాయని స్వయంగా చంద్రబాబు చెప్పడం, కేవలం టిడిపి నేతలను సన్నాహం చేయడానికేనా లేక అందులో వాస్తవం ఏమైనా ఉందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏదైనా గానీ ఎన్నికల గురించి గానీ, కరెన్సీ నోట్ల గురించి గానీ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను లైట్ గా తీసుకోలేము అంటున్నారు టిడిపి వర్గీయులు కూడా! ఎప్పుడు వచ్చినా మళ్ళీ అధికారం తెలుగుదేశం పార్టీదే అన్న నమ్మకాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు.