chandrababu naidu sattire on ys jagan three capitalsఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తరువాత కూడా జగన్ తన ‘మూడుముక్కలాట’ కొనసాగిస్తూనే ఉన్నారంటూ, చివరికు జగన్ న్యాయస్థానాలను కూడా వదిలి పెట్టకుండా అసెంబ్లీ సాక్షిగా న్యాయమూర్తుల తీర్పులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తనదైన శైలిలో చంద్రబాబు విరుచుకుపడ్డారు.

తన 40 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని రంగరించి విమర్శలకు పదును పెట్టినట్లుగా జగన్ మీద రెచ్చిపోయారు టీడీపీ అధినేత. “ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం ఇష్టం లేకనే అమరావతిని రాజధానిగా ఆమోదిస్తున్నా” అని అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అసెంబ్లీలో జగన్ చెప్పిన మాటలు. మరి ఇప్పుడు జగన్ చేస్తున్న పనులు దేనికి సంకేతమో..? అతనే చెప్పాలి అంటూ ప్రశ్నించారు బాబు.

ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి తన పబ్బం గడుపుకోవడానికి జగన్ ఈ మూడు రాజధానుల వికృత క్రీడను మొదలుపెట్టారని., కడాన దానికి ‘అధికార వికేంద్రీకరణ’ అంటూ వంత పాడుతున్నారని., జగన్ మోసపు రెడ్డి మాటలను ప్రజలు ఇప్పుడు విశ్వసించరని వైసీపీ విధానాలపై బాబు మండిపడ్డారు.

‘పోలవరం., అమరావతి’ ఆంధ్రప్రదేశ్ కు రెండు కళ్ళని, ఆ రెండు కళ్ళను జగన్ పొడిచేశారని, రాష్ట్రానికి ఒక శని గ్రహంలా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి “అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి….కానీ అధికార వికేంద్రీకరణ కాదు., వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు పైన విషం చిమ్ముతున్నారని ప్రజలు గమనించాలంటూ” విజ్ఞప్తి చేశారు.

జగన్ తీసుకుంటున్న అనాలోచన చర్యల వలన రాష్ట్రం ఆర్ధికంగా కుంటుపడిపోతుందని., రాష్ట్రంలో జిల్లాల పెంపు అంటూ 26 జిల్లాలను ఏర్పాటు చేసిన మాదిరిగానే జిల్లాకో రాజధాని నిర్మించి “రొటేషన్ లో” రాజధానిని రాష్ట్రమంతా తిప్పండి. మీకున్న తెలివి దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కూడా లేదు అందుకే దేశానికి ఒకే రాజధాని., ఒకే పార్లమెంట్ అంటూ పాతకాలం ఆలోచనలోనే ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ప్రధానితో మాట్లాడి రాష్ట్రానికో పార్లమెంట్ భవనం., సెంట్రల్ కేబినెట్ పెట్టమని., తద్వారా దేశం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని., మొబైల్ బ్యాంకింగ్ మాదిరి మొబైల్ పార్లమెంట్స్ నిర్మించి ఒక ట్రైన్ పెట్టి దేశమంతా తిప్పుదాం., సిగ్గుండాలి జగన్ కు అంటూ నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే పరిశ్రమలు రావాలి., పెట్టుబడులు పెట్టాలి., ఉద్యోగాల కల్పన జరగాలి., సంపద సృష్టి కావాలి., అక్షరాస్యతను పెంచాలి., సముద్ర తీర ప్రాంతాలలో పోర్టుల నిర్మాణం జరగాలి., ఇరిగేషన్ పనులు పూర్తి చేసి రైతులకు, ప్రజలకు తాగు – సాగు నీటిని అందించాలి., రోడ్ రవాణా వ్యవస్థని విస్తరించాలి., టెక్నాలజీని పల్లెల్లోకి తీసుకువెళ్లగలగాలి., అంతే కానీ పరిపాలన కేంద్రాలను వికేంద్రీకరించకూడదు.

పరిపాలన వికేంద్రీకరణ అంటే అది ‘రాష్ట్ర విధ్వంసం’కే దారి తీస్తుంది. ఇలా జిల్లాకో రాజధాని… రాష్ట్రానికో పార్లమెంట్… అంటూ ఆలోచించడం తుగ్లక్ చర్యే అవుతుంది జగన్ అంటూ వైసీపీ ప్రభుత్వ విధానాల వలన రాష్ట్రానికి జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించారు చంద్రబాబు. ఇంత జరుగుతున్నా తన వితండ వాదనతో ముందుకెళ్తున్న జగన్ తీరుకు నిజంగా ‘నువ్వు దేవుడు సామి’ అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.