Chandrababu Naidu - YS Jagan (2)అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్ లో ఇస్తున్న విందుకు పలువురు ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపించారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పిలిచి ఏపీ ముఖ్యమంత్రిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని పిలవకపోవడం వివాదాస్పదం అయ్యింది.

దీనిపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని విమర్శించారు. చిత్తూరు జిల్లా టీడీపీ కార్యకర్తలతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆర్థిక నేరగాడు కాబట్టే ట్రంప్ పర్యటనకు జగన్‌ను పిలవలేదని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు అమెరికా అధ్యక్షులు రాష్ట్రానికి తీసుకొచ్చిన స్థాయి నుండి ఇప్పుడు కనీసం వారి విందుకు కూడా ఆహ్వానం దక్కని పరిస్థితికి వచ్చాం అన్నారు.

టీడీపీ హయాంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయని.. వైసీపీ హయాంలో అవన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయన్నారు. ప్రజల్లోకి వెళ్లి.. సమస్యలపై పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ మూర్ఖుడిగా, సైకో లాగా మారిపోయారన్నారు. తన మీద కోపంతో తన నియోజకవర్గానికి నీళ్లు రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

సోషల్ మీడియాతో టీడీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు.. త్వరలో నారా లోకేష్ కుప్పంలో పర్యటిస్తారని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటాన్ని కుప్పం నుంచే ప్రారంభిస్తామన్నారు. అమరావతి, అభివృద్ధి కోసం యువత పోరాడాలని పిలుపునిచ్చారు. అయితే ట్రంప్ విందుకు జగన్ కు పిలవకపోతే రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమిటి అనే వాదన తెర మీదకు తెస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ వారు.