Chandrababu Naiduవైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ఏపీ రాజధాని గురించి ప్రశ్నించి తెలివి ప్రదర్శించబోయి జగన్‌ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బంది కలిగించారు. ఏపీకి అమరావతినే రాజధానిగా గుర్తిస్తున్నామని, మూడు రాజధానుల సంగతి తమకి అనవసరమని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ విస్పష్టంగా చెప్పడంతో వైసీపీ నేతలెవరూ మాట్లాడలేని పరిస్థితి! కనీసం వారి బాకా మీడియా దీనిని ఎలా సమర్ధించుకోవాలో తెలియక ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశమని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని వ్రాసుకొంది.

ఏపీ రాజధానిపై కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన సమాధానంపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గురువారం మంగళగిరి టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఆరోజు రాష్ట్ర విభజన చట్టం ప్రకారమే కేంద్ర ప్రభుత్వం శివారామకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. దాని నివేదిక ఆధారంగా మేము అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తే దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టుకి సమర్పించిన తాజా అఫిడవిట్‌లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే పేర్కొంది.

ఆనాడు 29 వేల మంది రైతులు అమరావతి కోసం తమ జీవనోపాధినిచ్చే 34 వేల ఎకరాల భూములు ఇచ్చారు. అమరావతి నిర్మాణ పనుల కోసం అప్పుడు మేము రూ.11,395 కోట్లు ఖర్చు పెడితే, మా తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం మాపై దుష్ప్రచారం చేసి అమరావతిని పక్కన పెట్టేసింది. అది గనుక పూర్తయ్యి ఉంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు వచ్చి ఉండేవి. కానీ జగన్‌ తన అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని కోలుకోలేని విదంగా దెబ్బ తీశారు.

విభజన చట్టం ప్రకారమే రాజధాని ఏర్పాటు చేసుకోవాలని ఉండగా దానికి జగన్‌ ప్రభుత్వం వక్రభాష్యాలు చెప్పి మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టింది. రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని హైకోర్టు స్పష్టంగా చెపితే జగన్‌ ప్రభుత్వం నిసిగ్గుగా సుప్రీంకోర్టుకి వెళ్లింది.

ఆనాడు తాడేపల్లిలో ఇల్లు కట్టుకొంటున్నానని, అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పిన జగన్, అధికారంలోకి రాగానే మాట మార్చి మూడు రాజధానులు అంటూ మూడున్నరేళ్ళుగా ప్రజలని మభ్యపెడుతూ కాలక్షేపం చేసేస్తున్నారు. ఊసరవెల్లి కూడా జగన్ని చూసి సిగ్గు పడుతుంది.

జగన్‌ అధికారంలోకి రాగానే ఉండవల్లిలో ప్రజావేదిక కూల్చివేతతో తన విధ్వంస పాలన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌కి రెండు కళ్ళవంటి అమరావతిని, పోలవరాన్ని దెబ్బ తీసి రాష్ట్రాని కోలుకోలేనివిదంగా దెబ్బ తీశారు. నిజానికి ఆనాడు రాష్ట్ర విభజన కంటే ఈ మూడున్నరేళ్ళలో జగన్మోహన్ రెడ్డి పాలన వలననే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది.

ఇప్పుడు విశాఖలో రాజధాని అంటూ హడావుడి చేస్తున్నారు. కానీ ఏం చేశారు? ఋషికొండకి బోడిగుండు కొట్టేశారు. ఉత్తరాంద్రని గంజాయి కేంద్రంగా మార్చేశారు. ఇంత అనర్ధం జరుగుతున్నా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ నోరు విప్పి మాట్లాడలేకపోతున్నారు. రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టించిన జగన్మోహన్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో తప్పక దోషిగా నిలబెడతాము,” అని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.