chandrababu-pawan-kalyan-kakinadaకేంద్రం ఇచ్చిన ప్యాకేజ్ పై ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు? అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే ఎంతగా ఎదురుచూసారో మరోసారి స్పష్టమైంది. నిజానికి కేంద్రం ప్యాకేజ్ ప్రకటించిన సమయంలో కూడా చంద్రబాబు ‘పవన్ పేరు’ను లేవనెత్తారు. ఈ ప్యాకేజ్ తర్వాత పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఎలా ఉంటుందో చూడాలి? అంటూ మీడియా వర్గాలతో పంచుకున్నారు. మరి పవన్ ప్రసంగం ముగిసింది. దీనిపై చంద్రబాబు ఏమన్నారు? అంటే…

పవన్ ప్రసంగం ఎంత సింపుల్ గా ముగిసిందో… చంద్రబాబు కూడా అంతే సింపుల్ గా చెప్పారు. ‘జనసేన’ అధినేత చెప్పిన విషయాలన్నీ నిజమేనని, ఏపీకి కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇస్తే అందరి కంటే సంతోషించేది తానేనని, హోదా వస్తే అనేక అంశాలలో వెసులుబాటు ఉంటుందని… సింపుల్ గా చెప్పేశారు. పవన్ ఆలోచనలను ఇంతగా అర్ధం చేసుకున్న సిఎం చంద్రబాబు, మరో వైపు ప్రతిపక్ష అధినేతపై కూడా ఈ సందర్భంగా కొన్ని కామెంట్స్ చేసారు.

వైసీపీ అధినేతవి ఉన్మాద చర్యలని, రెండు రోజులుగా అసెంబ్లీ జరిగిన తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అలాగే బంద్ లకు పిలుపునిస్తూ ప్రజా జీవితాలను భంగం కలిగిస్తున్నారని, ప్రజలను ఇబ్బందుల పాలు చేసే కార్యక్రమాల్లో జగన్ ముందుంటున్నారని, బంద్ కు ప్రజలు సహకరించవద్దు అంటూ పిలుపునిచ్చారు. ఓ పక్కన పవన్ కళ్యాణ్ ఆలోచనలను సమర్ధిస్తూ… మరో పక్కన జగన్ తీరును చంద్రబాబు నాయుడు ఎండగట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.