Chandrababu Naidu responds to KCRనిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తీవ్రమైన ఆరోపణలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. తనదైన శైలిలో కేసీఆర్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. కేసీఆర్‌ హుందాతనం కోల్పోయి పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని, సీఎం హోదాలో ఉండి అనాగరికంగా మాట్లాడడమేంటని ప్రశ్నించారు. నోరుందని పారేసుకోకూడదని హితవు పలికారు. ఏపీలో మోదీ, జగన్‌, కేసీఆర్‌ కలిసి పోటీ చేస్తానంటే చేయండి.. అంతేగానీ ముసుగులో గుద్దులాట ఎందుకు అని ప్రశ్నించారు.

కేసీఆర్‌ మిడిల్‌ మోదీ అయితే, జగన్‌ జూనియర్‌ మోదీ అని ఎద్దేవా చేశారు. “నేను ఎన్టీఆర్‌ నుంచి పార్టీని లాక్కున్నారని కేసీఆర్‌ అంటున్నారు. అప్పుడు కేసీఆర్‌ నాతోనే ఉన్నారుగా. వైస్రాయ్‌ ఘటనలో కేసీఆరే సిద్ధాంతకర్త. ఆయనే కదా అక్కడ ఆర్గనైజింగ్ అంతా. ప్రత్యేక హోదా కోసం లేఖ రాస్తానని అంటున్నారు. రాయండి. మంచిదే. అదే హోదా మీద రోజుకో మాట మాట్లాడుతున్నది మీరు కాదా?, సోనియా గాంధీ ఇస్తామంటే తప్పు పట్టలేదా?” అని చంద్రబబు అన్నారు.

వ్యవసాయ రంగంలో ఈ నాలుగేళ్లలో మీరు సాధించిన అభివృద్ధి కేవలం 0.2 శాతం మాత్రమే. ఏపీ 11 శాతం సాధించింది. రైతుల కోసం తాను పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శమని చెబుతున్నారు. అదే దేశం 2.4 శాతం సాధిస్తే.. ఈయన వల్ల 0.2 శాతం వృద్ధి సాధించింది. ఇరిగేషన్‌ కోసం లక్ష కోట్లు ఖర్చు చేశామని కేసీఆర్‌ చెబుతున్నారు. మరి ఏవీ కనిపించడం లేదే. ఈయనని చూసి మేము నేర్చుకోవాలా? ఈయన కార్యక్రమాలు మేము కాపీ కొట్టాలా? అని ఎద్దేవా చేశారు చంద్రబాబు.

“నాకు భాష రాదని అంటున్నారు. ఆయనకు ఏదో భాషొచ్చని ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన ఆక్స్‌ఫర్డ్‌లో చదివారు మరి! ఆయన నా చేత జైతెలంగాణ అనిపించానని చెబుతున్నారు. ఆయన అనిపించేది ఏమిటి? విభజిస్తానంటే విభజించండి అని నేనే చెప్పా. మోడీ పైనే పోరాడుతున్నా ఈయనేంత? ఎవరిని బెదిరిస్తారు? మానసికంగా నన్ను ఎవరూ దెబ్బతీయలేరు ఏం చెయ్యగలరు మీరు? మీరు కేసు పెడతానంటే మేం నాలుగు కేసులు పెడతాం,” అని చంద్రబాబు విరుచుకుపడ్డారు. తన సహజ శైలిలో మర్యాద ఇస్తూనే బాష అదుపులో పెట్టుకుంటూ లెక్కలతో సహా కేసీఆర్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు చంద్రబాబు.