Chandrababu Naidu responds EVMs controversyఓటమి భయంతోనే చంద్రబాబు ఈవీఎంలపై నిందలు మోపుతున్నారని, ఓటమికి కారణాల కోసమే ఎన్నికల సంఘాన్ని నిందిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిని కొట్టి పారేశారు చంద్రబాబు. “రెండొందల శాతం ధీమాతో చెప్తున్నా.. మేం గెలుస్తున్నాం,” అని మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు చంద్రబాబు. . తెల్లారుజాము నాలుగున్నర వరకూ ప్రజలు ఓట్లు వేశారంటే… అది కేంద్రంపై, ఎన్నికల నిర్వహిస్తున్న తీరుపై వారు వ్యక్తం చేసిన ఆగ్రహమే అన్నారు ఆయన.

ఆంధ్రాలో ఎన్నికలు అయిపోయాయని… ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టడానికి, ఎన్నికల ప్రక్రియ మీద ప్రజలకు నమ్మకం కలిగించడానికే ఈ యజ్ఞానికి పూనుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. బ్యాలెట్‌ పద్ధతిలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు కాబట్టి.. వీవీప్యాట్‌ స్లిప్పులను 50శాతం లెక్కించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గతంలో ఇదే విషయంగా చంద్రబాబు నేతృత్వంలోని 23 ప్రతిపక్ష పార్టీలో సుప్రీం కోర్టులో కేసు వేసాయి.

అయితే స్వల్ప ఊరట మాత్రమే లభించింది. ఇప్పుడు అదే కేసులో మరొక సారి రివ్యూ పిటిషన్ వెయ్యదలిచారు. వీవీప్యాట్‌ స్లిప్పులను 50శాతం లెక్కించాలంటే ఫలితాల వెల్లడికి ఆరు రోజుల సమయం పడుతుందని సుప్రీం కోర్టులో ఎన్నికల సంఘం చెప్పడం విశేషం. ఇది పూర్తిగా అవాస్తవం అని ప్రతిపక్షాల ఆరోపణ. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ఏడు విడతలలో జరుగుతున్నాయి. మొదటి విడత పోలింగ్ పూర్తి అయ్యింది. చివరి విడత పోలింగ్ మే 19న జరుగుతుంది. మే 23న ఫలితాలు వెల్లడి అవుతాయి.