Chandrababu Naidu responds on buggana rajendranath reddy kia comments2007లో స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి అడిగిన మీదటే దక్షిణ కొరియా ఆటోమొబైల్ జైంట్ కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. సోషల్ మీడియాలో దీని పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం దీనిపై తన వాదనకు కట్టుబడి దీనిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీలో స్పందించారు.

“రాజేంద్రరెడ్డి గారూ.. మీరు చాలా తెలివైన వారు.. హ్యాట్సాఫ్.. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే 2009లో రాజశేఖరెడ్డి గారు చనిపోయారు. ఆయన ఆత్మ కియా సీఈవో దగ్గరికి వెళ్లింది. 2016లో మీరు చంద్రబాబు దగ్గరకెళ్లండి. అనుమతిలన్నీ ఇస్తారు. కియా పెట్టండి అని వైఎస్ చెప్పారు. దీంతో ఆయనొచ్చి పెట్టారు. అదే కదా మీరు చెప్పే కథ. ఏం చెప్పాల రాజేంద్రరెడ్డి గారు.. మీరు ఎంత గొప్ప నాయకులంటే ఇలాంటి అసత్యాలను కూడా సత్యంగా చెప్పే మనస్తత్వం మీకుంది. దీనికి మిమ్మల్ని అభినందిస్తున్నా. మనస్ఫూర్తిగా మీకు కంగ్రాజ్యులేషన్స్,” అని చంద్రబాబు సభలో వ్యంగ్యంగా విమర్శించారు.

అయితే బుగ్గన మాత్రం చెప్పినదానికే కట్టుబడిఉన్నారు. “చంద్రబాబు నన్ను తెలివైన వాడని అన్నారు. అందుకు ధన్యవాదాలు చెప్తున్నా. కానీ తెలివి ఉన్నా లేకున్నా నిజం నిజమే కదా అధ్యక్ష. ఈ లేఖ జూన్ 13, 2019న రాశారు. ‘2007లో వైఎస్‌ను కలిశాను. కలిసినప్పుడు స్వర్గీయ రాజశేఖరరెడ్డి గారు నన్ను ప్లాంట్ పెట్టమని రిక్వెస్ట్ చేశారు’ అని లేఖలో కియా సీఈవో పేర్కొన్నారు. మీరు వ్యంగ్యంగా మాట్లాడినా.. ఎలా మాట్లాడినా దీవెన కిందే స్వీకరిస్తున్నాం,” అని ఆయన చెప్పుకొచ్చారు.