YS Jagan  Chandrababu Naiduఉండవల్లిలోని ప్రజావేదిక ఇప్పుడు టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ ల మధ్య వివాదంగా మారే అవకాశం ఉంది. ప్రజావేదికను ప్రతిపక్ష నేతకు కేటాయించాలని చంద్రబాబు ముఖ్యమంత్రికి లేఖ రాసిన కొన్ని గంటల తరువాత పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకునేందుకు ప్రజావేదికను తమకే కేటాయించాలని ఏపీ సీఎస్‌ ఎల్వీసుబ్రమణ్యంను వైఎస్సార్ కాంగ్రెస్ కోరింది. పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం కార్యక్రమాలకు ప్రజావేదిక అనువుగా ఉంటుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పేర్కొన్నారు.

ప్రజావేదికలో నిర్వహించే సమావేశాలకు వైకాపా అధ్యక్షుని హోదాలో సీఎం జగన్‌ హాజరవుతారని ఆయన తెలిపారు. ఇక్కడ విశేషం ఏమిటంటే జగన్ తాడేపల్లిలోని తన నివాసాన్ని సీఎం క్యాంపు ఆఫీసుగా మార్చుకున్నారు. అక్కడ నుండీ, సచివాలయం నుండీ ఆయన పని చెయ్యబోతున్నారు. సీఎం క్యాంపు ఆఫీసును ఆనుకునే వైఎస్సార్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయం ఉంది. ముఖ్యమంత్రి హోదాలో సెక్రటేరియట్ నుండి గానీ క్యాంపు ఆఫీసు నుండి గానీ జగన్ మాట్లాడుకోవచ్చు.

అలాగే పార్టీ వేదిక మీద నుండి మాట్లాడాలంటే పక్కనే పార్టీ ఆఫీసు ఉంది. అయితే చంద్రబాబు నాయుడు కావాలి అని అడిగారు కాబట్టే అది మాకు కూడా కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ అడుగుతున్నట్టుగా ఉంది ఈ వ్యవహారం అని టీడీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వడ్డించే వాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఒక్కటే అన్నట్టు అధికారం వైఎస్సార్ కాంగ్రెస్ ది కాబట్టి ఆ పార్టీకే ప్రజావేదికను కేటాయించే అవకాశం ఉంది. గతంలో ప్రజావేదిక అనేది అక్రమకట్టడమని వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపించడం గమనార్హం.