ys Jagan - Chandrababu -naiduఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కృష్ణ కరకట్ట పక్కనే చంద్రబాబు నివాసం ఉన్న సంగతి తెలిసిందే. భవిష్యత్తులో కూడా తాను అక్కడే ఉండేలా భవన యజమానితో అగ్రిమెంట్ చేసుకున్నారు ఆయన. అయితే తన నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని ప్రతిపక్ష నేత నివాసానికి అనుబంధంగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు చంద్రబాబు.

పార్టీ అధినేతగా తనను కలిసేందుకు అనేకమంది వస్తుంటారని, తాను ఉంటున్న ఇంటిలో దానికి తగిన స్థలం లేదని. అందువల్ల ఈ భవనాన్ని తమకే కేటాయించాలని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. చంద్రబాబుకు, జగన్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండటం మన అందరికీ తెలిసిందే. ఇటువంటి తరుణంలో ముఖ్యమంత్రి దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటారా అనేదాని పై టీడీపీలోనే భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.

ప్రతిపక్షంలో చంద్రబాబు హైదరాబాద్, అమరావతికి రాకపోకలు సాగించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సమయం చిక్కడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కూడా కొంత సమయం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. వచ్చే ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీ అస్తిత్వానికే కీలకంగా పరిణమించనున్నాయి. ఇటీవలే ఎన్నికలలో టీడీపీ తన చరిత్రలోనే అత్యంత ఘోరమైన పరాజయాన్ని చవి చూసింది. ఈ కష్టకాలంలో చంద్రబాబు పార్టీని ఎలా గట్టెక్కించే తిరిగి అధికారంలోకి తెస్తారు అనేది చూడాల్సి ఉంది.