Chandrababu Naidu released manifesto for aqua Sectorఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాపగ్రస్తమైన రంగాలలో ఆక్వా రంగం కూడా ఒకటి. ఒకప్పుడు యావత్ దేశంలోనే నెంబర్:1 స్థానంలో నిలిచిన ఏపీ ఆక్వా రంగం ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతోంది. ఏ రంగమైన అభివృద్ధి సాధిస్తున్నప్పుడే దాని నుంచి ప్రతిఫలాలు లభిస్తాయనే చిన్న విషయం మరిచిన జగన్‌ సర్కార్, దాని అభివృద్ధికి తోడ్పడకుండా దానిపై పన్నులు, జరిమానాలు, విద్యుత్‌ ఛార్జీలతో పిండుకోవాలని ప్రయత్నించింది. ఆ కారణంగా ఏపీ ఆక్వా పరిశ్రమలు మూతపడే పరిస్థితికి చేరుకొంటున్నాయి. ఏపీ ఆక్వా పరిశ్రమల గురించి సమగ్ర అవగాహన ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిన్న మంగళగిరి పార్టీ కార్యాలయంలో ‘ఆక్వా రైతులకి ఇదేం ఖర్మ?’ పేరుతో సదస్సులో వారికి ఉపశమనం కలిగించే అనేక హామీలను ప్రకటించారు. రాష్ట్రంలో మళ్ళీ తమ పార్టీ అధికారంలోకి రాగానే మొట్ట మొదట అక్వా పరిశ్రమలకు మేలు చేసే ఈ నిర్ణయాలను అమలుచేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

1. రాష్ట్రంలో ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్‌ రూ.1.50కె ఇస్తాము.

2. ఆక్వా రైతులు, పరిశ్రమలకి 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తాం.

3. క్వా సాగుకి అత్యంత ముఖ్యమైన ఏరియేటర్లు, మోటర్లు, ట్రాన్స్‌ఫార్మార్లు, బోరు మోటర్ల ఏర్పాటుకి 50% రాయితీ ఇస్తాము.

4. ఆనాడు టిడిపి ప్రభుత్వ హయాంలో ట్రాన్స్‌ఫార్మార్లు, విద్యుత్‌ లైన్లు వేసేందుకు ఎంత ఛార్జీలు తీసుకొనేవారమో అవే చార్జీలతో ఏర్పాటు చేస్తాం.

5. అక్వా ప్రాసెసింగ్ పరిశ్రమలకు నీటి పన్ను ధరను తగ్గిస్తాము.

6. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్‌, విజిలెన్స్, జీఎస్టీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల దాడులు, వేధింపులు లేకుండా అవసరమైన చర్యలు చేపడతాం.

7. అక్వా రైతులకు నాణ్యమైన విత్తనం, దాణా అందిస్తాం. వాటి ధరలను కూడా నియంత్రిస్తాం.

8. రొయ్యలు, చేపల కొనుగోలుపై మార్కెట్ రుసుములను తగ్గిస్తాం.

9. అక్వా రైతుల కొరకు ప్రత్యేకంగా శీతల గోదాములు నిర్మిస్తాము.

అక్వా రైతులను ఆకట్టుకోవడానికి ఇవన్నీ చెప్పడం లేదని ఈ హామీలన్నిటినీ తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చడం ద్వారా తమ నిబద్దతని చాటుకొంటుందని చంద్రబాబు నాయుడు అక్వా రైతులకు భరోసా ఇచ్చారు. ఈ మూడున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం అక్వా రైతులను ఎన్ని రకాలుగా పీడించి పీల్చి పిప్పి చేసిందో చంద్రబాబు నాయుడు నిన్న గణాంకాలతో సహా వివరించడం గమనిస్తే ఈ రంగం పట్ల ఆయనకి ఉన్న అవగాహన, సానుభూతి అర్దం అవుతుంది.