Chandrababu Naidu questions narendra modi on utilisation certificatesకేంద్రప్రభుత్వం రాష్ట్రాన్ని కావాలనే ఇబ్బంది పెట్టే యోచనలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ఇప్పటిదాకా ఒక పథకం ప్రకారం కేంద్రం నిధులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదని, దాని వల్లే కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఒక వాదనను తెరమీదకు తెస్తూ వచ్చారు.

ఒక దశవరకు పట్టించుకోని ప్రభుత్వం మొత్తానికి కేంద్రానికి పంపిన యూసీలను బహిరంగ పరచింది. నిన్న నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కూడా వాటిని అన్ని పార్టీల వారికీ చూపించింది. దీనితో ఆత్మరక్షణలో పడిన బీజేపీ నాయకులు తాజాగా కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. ప్రభుత్వం ఇచ్చినవన్ని తప్పుడు యూసీలని చెప్పడం మొదలు పెట్టారు.

దీనిపై చంద్రబాబు ఈరోజు అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. యూసీలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం చెప్పాలన్నారు. ఇది కేంద్ర, రాష్ట్రాల మధ్య విషయమని, పార్టీలు ఇష్టానుసారంగా మాట్లాడొద్దన్నారు. మరోవైపు ఏప్రిల్‌ 2, 3వ తేదీల్లో సీఎం చంద్రబాబునాయుడు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి…అక్కడ అన్ని రాజకీయపక్షాలు, జాతీయ స్థాయి నాయకులను కలవాలని భావిస్తున్నట్టు సమాచారం.