Chandrababu naidu questions BJP governmentఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఎపికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆయన విమర్శించారు. విభజన వల్ల నష్టపోయిన ఎపిని ఆదుకోవాలసిన బాద్యత కేంద్రంపై ఉందని ,కాని మాటలు చెప్పి తప్పించుకుంటోందని ఆయన మండలిలో అన్నారు.

“విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాల్సిన కేంద్రం.. మాటలు చెప్పి తప్పించుకుంటోంది. పోలీసు అకాడమీ, సీసీఎంబీ వంటి సంస్థలు రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరు?. ఆంధ్రప్రదేశ్‌ భారతదేశంలో భాగం కాదా?. విభజన బలవంతంగా చేశాక రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. విభజన హామీల్లో కీలకమైన విశాఖ రైల్వేజోన్‌, కడపలో ఉక్కు కర్మాగారం హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదు. అమరావతి, విశాఖ నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు మోకాలడ్డుతున్నారు. ఏపీకి పారిశ్రామిక రాయితీలు ఎందుకివ్వరో కేంద్రం చెప్పాల్సిన అవసరం ఉంది.” ఆయన అన్నారు.

కేంద్రం ఇచ్చిన నిధులకు సరిగ్గా లెక్కలు చెప్పడం లేదు అన్న వాదనపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. “పోలవరం ప్రాజెక్టు వ్యయంపై అన్ని యూసీలు సక్రమంగానే పంపాం. రాజధాని నిధులకు సంబంధించి అన్ని యూసీలు నీతిఆయోగ్‌కు పంపాం. మేం పంపిన అన్ని యూసీలను నీతిఆయోగ్‌ కూడా ధ్రువీకరించింది. మేం ఎన్నో దేశాలు తిరిగి రాబట్టిన పెట్టుబడులు కేంద్రం వల్లే వచ్చాయని కొందరు చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో కియా కార్ల కంపెనీ కేంద్రం సాయం వల్లే వచ్చిందని చెప్పడం విడ్డూరంగా ఉంది” అని చంద్రబాబు మండలిలో ఉన్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఉద్దేశించి అన్నారు.