Chandrababu Naidu Prohibited From Visiting Polavaram Projectటిడిపి అధినేత గురువారం సాయంత్రం పోలవరం ప్రాజెక్టుని సందర్శించడానికి బయలుదేరారు. కానీ ప్రాజెక్టుకి చాలా దూరంలోనే బ్యారికేడ్లు పెట్టి పోలీసులు ఆయనని అడ్డుకొన్నారు. దీంతో చంద్రబాబు నాయుడుతో సహా టిడిపి నేతలు అక్కడే బైటాయించి నిరసనలు తెలిపారు. అయినా పోలీసులు వారిని పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్ళనీయలేదు. పోలవరం ప్రాజెక్టు ఏమైనా నిషేదిత ప్రాంతమా? అక్కడకి మమ్మల్ని ఎందుకు వెళ్ళకుండా ఎందుకు అడ్డుకొంటున్నారు?అని చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు పోలీసులని నిలదీశారు. కానీ వారి వద్ద సమాధానం లేదు. ఎన్నిసార్లు అడిగినా ప్రాజెక్టు దగ్గరకి వెళ్ళడానికి ఎవరికీ అనుమతి లేదని ఒక్కటే సమాధానం వస్తోంది.

ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా ముందుకు సాగేందుకు తాను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసిన సంగతిని గుర్తు చేశారు. తాను ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ఎంత శ్రమించారో చంద్రబాబు నాయుడు వివరించారు. పోలవరం ప్రాజెక్టు పనులలో 70 శాతం పనులు తాను పూర్తి చేయిస్తే, మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయించలేని సిఎం జగన్మోహన్ రెడ్డి తనను ప్రాజెక్టుని సందర్శించకుండా అడ్డుకోవడాన్ని చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పు పట్టారు.

అసలు పోలవరం ప్రాజెక్టుని సందర్శించకుండా చంద్రబాబు నాయుడుని, టిడిపి శ్రేణులను వైసీపీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకొంటోంది? అని ప్రశ్నించుకొంటే అక్కడ నత్తనడకన జరుగుతున్న పనుల గురించి వారికి తెలిసిపోతే తమ ప్రభుత్వ అసమర్దతని విమర్శిస్తారనే భయంతో కావచ్చు లేదా చంద్రబాబు నాయుడుని ఎక్కడికక్కడ కట్టడి చేశామని తృప్తి కోసం కావచ్చు.

కానీ పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్ళనీయకుండా అడ్డుకోవడం ద్వారా అక్కడ జరగరానిది ఏదో జరిగిందని లేదా ఏదో జరుగుతోందని సామాన్య ప్రజలు కూడా అనుమానించేలా చేసుకొందని చెప్పవచ్చు. అదే… చంద్రబాబు నాయుడుని, టిడిపి శ్రేణులని ప్రాజెక్టు వద్దకు వెళ్లనిస్తే వారు అక్కడి పనుల పురోగతిని చూసి కొన్ని రోజులు ప్రభుత్వ అసమర్దతని ఎండగడతారు.

మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వాటికి ధీటుగా సమాధానాలు చెప్పుకోగల సమర్దులే కదా?ముఖ్యంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరీ సమర్దుడే. “నేను కాసేపు సంస్కారాన్ని పక్కన పెట్టి మాట్లాడటం మొదలుపెడితే చంద్రబాబు నాయుడు ఉరివేసుకొని చచ్చిపోతారని” అంబటి రాంబాబు తనకి తాను కితాబు కూడా ఇచ్చుకొన్నారు కూడా. కనుక చంద్రబాబు నాయుడుని పోలవరం ప్రాజెక్టుని చూడకుండా అడ్డుకోవడం ఎందుకు? ఆయనని చూడనిచ్చి ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పువచ్చు కదా?కానీ చంద్రబాబు నాయుడుని ప్రాజెక్టు వద్దకు వెళ్ళనీయకుండా అడ్డుకొంటున్నారంటే అర్దం ఏమిటి?