బాబు ఆనాడే పలికారు... జనాలే వినలా..!2014లో అధికారం చేపట్టిన పిదప అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి, కీలక నిర్మాణాలను పూర్తి చేసి మరియు పోలవరం నిర్మాణంలో ఎక్కువ శాతం పూర్తి చేసి, ఎన్నికలకు వెళ్లిన సమయంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారంలో భాగంగా పలు కీలక వ్యాఖ్యలు చేసారు.

చంద్రబాబు చేసిన నాటి వ్యాఖ్యలు ప్రముఖ దినపత్రిక ప్రధానంగా ప్రచురించింది. ఆ వ్యాఖ్యలు చేసి రెండున్నర్రేళ్ళు ముగియగా, నాటి బాబు వ్యాఖ్యలు అక్షర సత్యాలుగా మారడంతో, ఈ దినపత్రిక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హెచ్చరిక… జగన్ వస్తే అమరావతి ఆగిపోతుంది, పోలవరం ప్రాజెక్టూ అంతే! వీటిని అడ్డుకోవాలని కేసీఆర్ కుయుక్తులు పన్నుతున్నారు, అంతా కలిసి ఆంధ్రను నాశనం చేయాలనుకుంటున్నారు. జగన్ వస్తే ఊరికో రౌడీ, బజారుకు భూకబ్జాదారుడు పుట్టుకొస్తారు… అంటూ నాడు బాబు చేసిన వ్యాఖ్యలను రోజు క్రితం పవన్ కళ్యాణ్ కూడా స్ఫురించారు.

ఐదేళ్లల్లో అసెంబ్లీకి 24 సార్లు వస్తే, సీబీఐ కోర్టుకు 245 సార్లు వెళ్లాడని, ఆయనకు తెలిసింది దొంగ లెక్కలే, విశ్వసనీయత లేని పార్టీ వైసీపీ అని, దానిని నమ్మితే కుక్క తోకతో గోదారి ఈదినట్లే అని 2019లో చంద్రబాబు వినిపించిన భవిష్యవాణి ఇప్పుడు నిజమైందని నెటిజన్లు ఈ ఫోటోకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు.

వర్తమానానికి వస్తే, అమరావతి ఆగిపోయింది, పోలవరం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మెరుగు. సీబీఐ కోర్టు నుండి మినహాయింపు కావాలన్న పిటిషన్ కోర్టు పరిధిలో ఉంది. 2019 నుండి అభివృద్ధి అన్నది బహిరంగ అంశమే… ఇలా అన్ని కీలక అంశాలపై బాబు నాడు గొంతు చించుకున్నా, ప్రజలకు ఎక్కలేదు అన్నదే నెటిజన్ల అంతిమ మాట.