Chandrababu_Naidu_Pileru_Sub_Jailటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం అన్నమయ్య జిల్లాలోని పీలేరు సబ్ జైలులో ఉన్న మైనార్టీ వర్గానికి చెందిన 8 మంది టిడిపి కార్యకర్తలని పరామర్శించారు. రొంపిచర్ల ఫ్లెక్సీ వివాదంలో పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపారు. చంద్రబాబు నాయుడు జైల్లో టిడిపి కార్యకర్తలని పరామర్శించి బయటకి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “పండగపూట మా పార్టీ కార్యకర్తలని జైల్లో పెట్టడం చాలా దారుణం. వైసీపీ కార్యకర్తలు మా ఫ్లెక్సీ బ్యానర్లు చించేస్తుంటే అక్కడే ఉన్న పోలీసులు పట్టించుకోకపోగా వారిని అడ్డుకొనందుకు మా పార్టీ కార్యకర్తలనే అరెస్ట్ చేశారు. పోలీసులు తమని కొట్టారని జైల్లో ఉన్న మా కార్యకర్తలు చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగించింది. చట్టం ప్రకారం నడుచుకోవలసిన పోలీసులు, వైసీపీ నేతల కనుసన్నలలో నడుచుకొంటున్నారు. వారి మాటలు విని టిడిపి కార్యకర్తలని వేధిస్తున్న పోలీసులందరిపై మేము అధికారంలోకి వచ్చాక కటినమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరిస్తున్నాను. జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తోంది. వారి కోడికత్తి డ్రామాలన్నీ ముగిసిపోయే రోజు దగ్గర్లోనే ఉంది. మంత్రి పెద్దిరెడ్డికి కూడా రోజులు దగ్గర పడ్డాయి. అందుకే ఆయన ఇంతగా రెచ్చిపోతున్నారు. దీనికి ఆయన తప్పక మూల్యం చెల్లించాల్సివస్తుందని మరిచిపోవద్దు,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.

అధికార, ప్రతిపక్షాల మద్య విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణమే కానీ ఏపీలో మాత్రం టిడిపి నేతలపై భౌతిక దాడులు, కార్యకర్తలపై ఈవిదంగా పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తుండటం వంటి ఘటనలు చాలా ఎక్కువైపోయాయి. కనుక వచ్చే ఎన్నికలలో టిడిపి అధికారంలోకివస్తే ఇంతకింత ప్రతీకారం తీర్చుకోవడం ఖాయం. అందుకే ఒకవేళ వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉంటారా వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోతారా? అని ఓ బిజెపి నేత సూటిగానే ప్రశ్నించారు.