Chandrababu -Naidu - Pawan Kalyanగత కొద్ది కాలంగా తెలుగు దేశం పార్టీ జనసేన పార్టీ మళ్ళీ కలుస్తాయని ప్రచారం నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వంపై పోరాడటంలో కలిసి పని చెయ్యాలని చంద్రబాబు సైతం పవన్ కళ్యాణ్ కు పిలుపు నిచ్చారు. ఈ వార్తలను పవన్ ఖండించినప్పటికీ ఈ మధ్య కాలంలో ఆయన టీడీపీని విమర్శించడం కొంత తగ్గించడం గమనార్హం. ఇదే సమయంలో ఆయన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పై దాడి ముమ్మరం చేశారు. దీనితో తెర వెనుక ఏమైనా జరుగుతుందా అనే అనుమానం అందరిలోనూ ఉంది.

తెలుగుదేశం, జనసేన ల మద్య పొత్తు అవకాశం ఉందని, టిడిపి రాజ్యసభ ఎంపీ టిజి వెంకటేష్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ లో బద్ద శత్రువులుగా ఉన్న సమాజవాది పార్టీ, బిఎస్పి కలిసినప్పుడు టిడిపి, జనసేన కలిస్తే ఇబ్బంది ఏమిటని ఆయన అన్నారు. టిడిపి, జనసేనల మధ్య ఎలాంటి విబేధాలులేవని కూడా ఆయన అన్నారు. అందువల్ల ఈ రెండుపార్టీలు కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవిని ఆశించడం లేదని కూడా ఆయన అన్నారు.

గత కొద్ది రోజులుగా దీనిపై ఊహాగానాలు వస్తున్న నేపద్యంలో వెంకటేష్ చేసిన ఈ ప్రకటన ఆసక్తికరంగా ఉంది. ఆయనకు నిజంగానే పొత్తు విషయంగా ఏదైనా ముందస్తు సమాచారం ఉందా లేక జనసేనపై మైండ్ గేమ్ వాడుతున్నారా? మరోవైపు ఈ నెల 25వ తారీఖున పవన్ కళ్యాణ్ వామపక్ష పార్టీ అగ్రనేతలతో పొత్తు, సీట్ల పంపకంపై విశాఖపట్నంలో చర్చలు జరపబోతున్నారు. సురవరం సుధాకర్ రెడ్డి, సీతారాం ఏచూరీ వంటి జాతీయ నాయకులు ఈ చర్చలకు రావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది.