Pawan-Kalyan-Chandrababu-Naiduఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ రాష్ట్ర యువత ఏ కార్యక్రమం చేపట్టినా తాను మద్దతిస్తానని ‘జనసేన’ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ నెల 26న విశాఖపట్నం ఆర్కే బీచ్ లో యువత మౌన నిరసన దీక్ష చేపడితే, ‘జనసేన’ దానికి మద్దతిస్తుందని వెల్లడించారు. అవకాశవాద, నేరపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓ ప్రత్యేక మ్యూజిక్ ఆల్బమ్ ను ‘దేశ్ బచావో’ పేరిట విడుదల చేస్తామని తెలిపారు.

‘గాంధీజీని ప్రేమిస్తాం.. అంబేద్కర్‌ను ఆరాధిస్తాం… సర్దార్ ప‌టేల్‌కి సెల్యూట్ చేస్తాం… భార‌త రాజ్యాంగాన్ని గౌర‌విస్తాం… కానీ త‌ల ఎగ‌రేసే ఉత్త‌రాది నాయ‌క‌త్వం ద‌క్షిణాది ఆత్మ‌గౌర‌వాన్ని కించ‌ప‌రుస్తూ ఉంటే మాత్రం చూస్తూ కూర్చోం… మెడలు వంచి కూర్చోపెడ‌తాం…’ అంటూ కాస్త విప్లవాత్మక ధోరణితో కూడిన ట్వీట్స్ చేశారు. ‘తిడితే భ‌రించాం… విడ‌గొట్టి గెంటేస్తే స‌హించాం… ఇచ్చిన మాట నిల‌బెట్టుకోక‌పోతే తిర‌గ‌బ‌డ‌తాం… అన్న‌ది ఆంధ్ర‌ యువ‌త… ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వానికి తెలియ‌జెప్పాలి’ అని పేర్కొన్నారు.

తమిళుల జల్లికట్టు పోరాటం నేపథ్యంలో ఆంధ్రప్రజలు స్ఫూర్తిని పొందాలని, పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకోవాలని పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. విద్యార్థులు పోరాటం జరిపితే వారి వెనుక నేనుంటానని కూడా పవన్ కల్యాణ్ తెలిపారు. అయితే త‌మిళ‌నాడులో పెద్ద ఎత్తున జ‌రుగుతున్న‌ జ‌ల్లిక‌ట్టు ఉద్యమంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదాకు పోలిక ఏమిటో తనకు అర్థం కావ‌ట్లేదని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు.

జల్లికట్టు పోరాటం నేపథ్యంలో వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలని పలువురు వ్యాఖ్యలు చేస్తున్న నేపధ్యంలో… చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాష్ట్రాభివృద్ధే త‌న‌కు ముఖ్య‌మని, కేంద్ర ప్ర‌భుత్వంతో గొడ‌వ‌లు పెట్టుకుంటే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయా? అని ప్రశ్నిస్తూ… రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన‌వారే త‌న‌కు ఇప్పుడు ప‌లు లేఖ‌లు రాస్తుండ‌డం త‌న‌కు విచిత్రంగా అనిపిస్తోంద‌ని అన్నారు. కులాలు ప్రాంతాలు మ‌తాల మ‌ధ్య చిచ్చుపెట్ట‌డం కొంద‌రికి అల‌వాటుగా మారిపోయిందని విమర్శల వర్షం కురిపించారు.