Chandrababu Naidu pantry car searched after YSRCP complaint నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఆవేశమే తన ఆలోచనగా జగన్ చేస్తున్న ప్రచారం పతాక స్థాయికి చేరుకున్నట్లుగా కనపడుతోంది. చంద్రబాబుకు అహంకారం అంటూ మళ్ళీ జగన్ చేసిన ఆవేశపూరితమైన వ్యాఖ్యల పర్యంతం ముగియకముందే, మరోసారి ఆ పార్టీ డిఫెన్స్ లో పడే స్థాయికి చేరుకుంది. శనివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారంలో పాల్గొంటున్న నేపధ్యంలో… పాంట్రీ వాహనాన్ని విజయవాడ నుండి నంద్యాలకు శుక్రవారం రాత్రి తరలించారు.

ఈ వాహనంలో చంద్రబాబు కోట్లాది రూపాయలు డబ్బులను తరలిస్తున్నారని ఎన్నికల సంఘం అధికారులకు సమాచారం అందగా, గాజులపల్లె మెట్ట శివార్లలో ఎన్నికల కమీషన్ పరిశీలకులు, పోలీసులు ఈ వాహనాన్ని అడ్డుకుని తనిఖీ నిర్వహించారు. ఆర్టీసీ పేరుతో రిజిస్టర్ అయిన కంటైనర్ నెంబర్ ఏపీ 16 జడ్ 0363 సీఎం ప్యాంట్రీ వాహనమని అధికారులకు డ్రైవర్ చెప్పినప్పటికీ, ఇంతలో వైసీపీ నేతలు కూడా చేరి, వాహనం తనిఖీ చేయాల్సిందేనని డిమాండ్ చేయడంతో, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఇంత జరుగుతుంటే… మీడియా హంగామా లేకుండా ఎలా ఉంటుంది. ఆ మీడియాలోనూ సాక్షి ప్రసారాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా! వాహనం డోర్లు తెరవడానికి ముందు వరకు దాదాపుగా కంటైనర్ లో నోట్ల కట్టలు ఉన్నాయని ప్రచారం చేసిన జగన్ మీడియాకు జలక్ ముందున్న విషయం తెలియరాలేదు. ఫైనల్ గా… మీడియా కళ్ళెదుటే అధికారులు వాహనం తాళాలను పగలకొట్టి కంటైనర్ లోని ప్రతి వంట సామాగ్రిని వెలికితీసి చూసారు. అందులో కూరగాయలు, వంట సామగ్రి మాత్రమే ఉన్నట్టు ఈసీ పరిశీలకులు, పోలీసులు గుర్తించడంతో వాహనాన్ని వదిలేశారు.

ఆవేశపూరితమైన చేష్టలతో మరోసారి ప్రజల ముందు, మీడియా ముందు వైసీపీ నేతల నిస్సహాయ స్థితి బయట పడినట్లయ్యింది. దీంతో జగన్ మీడియాకు కూడా చావుదెబ్బ తగిలినట్లయ్యింది. ఈ పరిణామాలతో వైసీపీ మరోసారి డిఫెన్స్ లో పడిపోయింది. శనివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయనున్న ప్రచారంలో ఈ అంశమే ప్రధాన హైలైట్ గా చంద్రబాబు చెలరేగిపోయే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఈసీ అధికారులకు ముఖ్యమంత్రిపై ఫిర్యాదు ఎవరు ఇచ్చారో గానీ, బుక్ అయ్యింది మాత్రం వైసీపీ నేతలేనని చెప్పవచ్చు.

మొత్తానికి జగన్ ఆవేశం, వైసీపీ నేతల అత్యుత్సాహాం టిడిపికి ప్రధాన బలమైన పాయింట్స్ గా కనపడుతున్నాయి. సినీ ఫక్కీలో సాగిన ఈ కంటైనర్ ఎపిసోడ్ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారడంతో, వైసీపీపై, జగన్ పై అదిరిపోయే పంచ్ లు పేలుతున్నాయి. అవకాశం దొరికింది కదా… చంద్రబాబును అడ్డంగా బుక్ చేసేసేద్దాం అని భావించిన జగన్ మీడియా, చివరికి తామే అత్యుత్సాహం ప్రదర్శించామని నాలుక కరచుకోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.