Chandrababu Naidu on  central governmentకష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం కనికరిస్తుందనుకుంటే… కేంద్రమే కష్టపెడుతున్న వైనం రాష్ట్ర ముఖ్యమంత్రిని కక్కలేక, మింగలేక చేస్తోంది. దాదాపు రెండేళ్ళ పాటు కేంద్ర సాయం కోసం నిరీక్షించిన చంద్రబాబు సర్కార్ ఇక ఉపేక్షించే యోచనలో లేదని తెలుస్తోంది. పోలవరం, మెట్రో, రాజధాని వంటి వాటి కోసం నిధులు అడుగుతుంటే… ముందు ఖర్చు పెట్టి తర్వాత బిల్లులు పెట్టుకోవాలని, మీరు అభివృద్ధి చేయకుండా నిధులు అడగడం సరికాదని ‘కాకమ్మ’ కబుర్లు చెబుతోంది.

అయితే ఈ అభిప్రాయంపై వాదనలు చేసుకోవడం కన్నా, సర్దుకుపోవడమే మంచిదన్న భావనతో ముందుకు వెళ్తున్న రాష్ట్ర సర్కార్, రెవిన్యూ లోటు విషయంలో ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడంపై మాత్రం తీవ్ర మనస్తాపానతో ఉన్నట్లుగా తెలుస్తోంది. 2014-15 సంవత్సరానికి గానూ 24 వేల కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉండగా, కనీసం సగం కూడా ఇప్పటివరకు చెల్లించలేదు. అలాగే, 2015-16 సంవత్సరానికి సంబంధించి దాదాపు మరో 20 వేల కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. వీటన్నింటిపై కనీసం నోరు మెదపకుండా, ఇటీవల కేవలం 900 కోట్లను మాత్రమే మంజూరు చేసింది.

ఓ పక్కన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఆగమ్యగోచరంగా మారినా, నిధుల మంజూరు విషయంలో అలసత్వం చూపడంతో కేంద్రానికి ఓ ఘాటు లేఖ రాయాలని చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి ఇప్పటివరకు జరిగిన అన్ని విషయాలను గణాంకాలతో సహా సమగ్రంగా పొందుపరిచి భావిస్తున్న “లేఖ” అప్పుడే పొలిటికల్ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా ‘టిడిపి – బిజెపి’ మైత్రి విడిపోవాలని భావిస్తున్న ఏపీ ప్రతిపక్షం జగన్ దీనిని తనకు అనుకూలంగా మార్చుకుంటారేమో అన్న ఆలోచనలు కూడా చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో కేంద్రంపై బాబు చేయాలన్న “దండయాత్ర” ఏ రూపు సంతరించుకుంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.